Share News

ఏపీ కోసమే గోదావరిలో ఎత్తిపోతలు బంద్‌

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:01 AM

కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో, ఏపీ జలదోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

ఏపీ కోసమే గోదావరిలో ఎత్తిపోతలు బంద్‌

  • గోదావరి నీళ్లను చంద్రబాబుకు గురుదక్షిణగా ఇచ్చేస్తున్న సీఎం: హరీశ్‌

వరంగల్‌, సిద్దిపేట ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో, ఏపీ జలదోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గోదావరి నదిలో నీటి ప్రవాహం ఉన్నప్పటికీ దేవాదుల ప్రాజెక్టు వద్ద గోదావరి జలాలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోయడం లేదని ఆరోపించారు. గోదావరి నీళ్లను గురువు చంద్రబాబుకు సీఎం రేవంత్‌ రెడ్డి ధారాదత్తం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. హనుమకొండ జిల్లా దేవన్నపేటలోని దేవాదుల ఫేజ్‌-3 మోటార్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సమ్మక్క బ్యారేజీ వద్ద 16వేల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పటికీ రైతుల అవసరాల తీర్చేందుకు నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీంఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ వద్ద 2,160 క్యూసెక్కులు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా 1700 క్యూసెక్కులే లిఫ్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పది మోటార్లు ఉంటే ఐదు మోటర్లే ఎందుకు రన్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. బడ్జెట్‌లో చెప్పిన 12 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం ఏమైందని, రెండేళ్లలో ఎన్ని ఎకరాలకు సాగు నీరు అందించారో మంత్రి ఉత్తమ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గోదావరి నీళ్లను చంద్రబాబుకు గురుదక్షిణగా వదులుతున్నారని ఆరోపించారు. ఇక, సిద్దిపేటలో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు.. కాంగ్రెస్‌ చెప్పిన ఎస్సీ, బీసీ, రైతు డిక్లరేషన్లన్నీ ఉత్తమాటలేనని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈసారైనా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 21 , 2026 | 03:01 AM