కృష్ణా జలాలపై ముఖ్యమంత్రికి అవగాహన లేకపోవడం దురదృష్టం: హరీశ్
ABN , Publish Date - Jun 06 , 2026 | 04:18 AM
కృష్ణాజలాల వినియోగంపై ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేకపోవడం దురదృష్టకరమని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు.
హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): కృష్ణాజలాల వినియోగంపై ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేకపోవడం దురదృష్టకరమని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు. అలాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రం ఉండడం వల్ల తెలంగాణ జల హక్కులకు విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హరీశ్ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. 2026 మే 2న తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్) కృష్ణాబోర్డుకు రాసిన లేఖ ప్రతులను ఈ పోస్టుకు జత చేశారు. ఈఎన్‌సీ రాసిన లేఖ ప్రకారం కృష్ణానదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్ 74.23శాతం వాటాను వినియోగించుకుంటే, తెలంగాణ కేవలం 25.77శాతం మాత్రమే వాడుకుందన్నారు. ప్రభుత్వం రాసిన అధికారిక లేఖలో ఏముందో కూడా ముఖ్యమంత్రికి, నీటిపారుదల శాఖ మంత్రికి తెలియదా ? అని హరీశ్ ప్రశ్నించారు. సీఎం తన వైఫల్యాలను కప్పిపుచ్చు కొనేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి.. తన రెండున్నరేళ్ల పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చేసింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు.