Share News

రైతుల గొంతుకోస్తున్న రేవంత్‌రెడ్డి: హరీశ్‌

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:26 AM

పంటల కొనుగోలుపై సీఎం రేవంత్‌ కేంద్రాన్ని సాకుగా చూపి రైతుల గొంతు కోస్తున్నారని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు.

రైతుల గొంతుకోస్తున్న రేవంత్‌రెడ్డి: హరీశ్‌

హైదరాబాద్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): పంటల కొనుగోలుపై సీఎం రేవంత్‌ కేంద్రాన్ని సాకుగా చూపి రైతుల గొంతు కోస్తున్నారని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. రోజుకో వింత నిర్ణయం, చెత్త విధానాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతోందని ఎక్స్‌ వేదికగా ఆయన విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణమన్నారు. రైతులు పండించిన పంట ప్రభుత్వం కొనకపోతే, ఆ పంటను రైతులు ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. కేంద్ర కోటాల పేరుతో కొనుగోళ్లకు పరిమితులు విధించడం రైతులను మార్కెట్‌ దయాదాక్షిణ్యాలపై వదిలేయడమేనన్నారు. వరి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం షరతులు, పరిమితులు విధిేస్త రైతుల బతుకులు ఆగమవుతాయన్నారు. రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, పంట బోనస్‌, కొనుగోళ్లు, నీటిసరఫరా, కరెంట్‌సరఫరా ఇలా అన్నింటిలో కోతలు పెడుతూ ప్రభుత్వం రైతుకు తీరని ద్రోహం చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. వానాకాలం సీజన్‌ నిధులతోపాటు, పెండింగ్‌లో ఉన్న మూడు విడతల రైతుభరోసా బకాయిలు మొత్తం రూ.16,545కోట్లు ఈనెల 30న మధిర వేదికగా రైతుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్‌ చేశారు. ఎల్‌నినో ప్రభావంపై నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడం లేదని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం పని చేసి, ఎల్‌నినో పేరుతో తప్పించుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 03:26 AM