విద్యాశాఖలో 2 వేల కోట్ల కుంభకోణం
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:53 AM
గుజరాత్ కాంట్రాక్టర్ల పేరుతో విద్యాశాఖలో రూ.2000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే పాఠశాలల పునఃప్రారంభం వాయిదా వేశారన్నారు.
కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే.. బడుల ప్రారంభం వాయిదా
100 కోట్ల కమిషన్‌తో విమానం కొన్న ఓ బ్రోకర్: హరీశ్
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్ర జ్యోతి): గుజరాత్ కాంట్రాక్టర్ల పేరుతో విద్యాశాఖలో రూ.2000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే పాఠశాలల పునఃప్రారంభం వాయిదా వేశారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్స్ కుట్టే బాధ్యత చేనేత కార్మికులకు, షూ, బెల్టుల తయారీ దళిత కుటుంబాలు బతకాలని లిడ్ క్యాప్‌కు ఇచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వాటిని సెంట్రలైజ్ చేసి.. గుజరాత్ కాంట్రాక్టర్‌కు అప్పగించారని మండిపడ్డారు. ఆ గుజరాత్ కాంట్రాక్టర్ నుంచి ఇంతవరకు బట్టలు రాలేదని, 7 లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఇవ్వాల్సిన బ్యాగులు, డ్రెస్సులు, బెల్టులు, పుస్తకాలు ఏవీ అందలేదన్నారు. అప్పులు తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం దళారులను పెట్టుకుందని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన వందకోట్ల కమిషన్‌తో ముంబైకి చెందిన ఓ బ్రోకర్ విమానం కోనుగోలు చేశారని తెలిపారు. రైతులకు, విద్యార్థులకు నిధులు లేవంటున్న ప్రభుత్వం.. సీఎం వసతి గృహానికి 100 కోట్లు.. హెలికాప్టర్‌లో షికార్లకు నెలకు 5 కోట్లు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక సీఎం రేవంత్ అత్యంత సన్నిహితుడి వెన్నుపోటు కుట్ర ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశించిన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనవ్యక్తే ఈ వెన్ను పోటుకు పాల్పడినట్లు తమకు పక్కా సమాచారం ఉందన్నారు. సీఎం విలాసాల కోసం క్యాంపు కార్యాలయాలు కడుతుంటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మంలో తన సొంతానికి మూడో క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నారని తెలిపారు. భూముల విలువలు అడ్డగోలుగా పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు చెప్పారు. ఈ ప్రభుత్వ విధానాలతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందని పేర్కొన్నారు. జర్నలిస్టులకు వివాదాలు లేని భూములు ఇవ్వాలని కోరారు. కేసులు నడుస్తున్న ఫ్యూచర్ సిటీలో స్థలాలు ఇస్తామనడం వంచించడమే అని అన్నారు.