Share News

Harish Rao: అశోక్‌నగర్‌ లైబ్రరీకెళ్లే దమ్ముందా?

ABN , Publish Date - Jan 10 , 2026 | 05:13 AM

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీని సిటీ సెంట్రల్‌ లైబ్రరీకి తీసుకెళ్లి.. అధికారంలోకి వస్తే ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇప్పించిన...

Harish Rao: అశోక్‌నగర్‌ లైబ్రరీకెళ్లే దమ్ముందా?

  • రేవంత్‌కు హరీశ్‌ సవాల్‌

హైదరాబాద్‌/ సిద్దిపేట/నంగునూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల ముందు ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీని సిటీ సెంట్రల్‌ లైబ్రరీకి తీసుకెళ్లి.. అధికారంలోకి వస్తే ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇప్పించిన సీఎం రేవంత్‌ రెడ్డికి ఇప్పుడు అశోక్‌నగర్‌కెళ్లే దమ్ముందా..? అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. అనంతరం ఇతర పార్టీల నేతలు సిద్దిపేటలో హరీశ్‌ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రేవంత్‌రెడ్డి నిరుద్యోగులను నమ్మించి నయ వంచన చేశారని ఆరోపించారు. 12 గంటలకు మించి కరంట్‌ రావడం లేదన్న హరీశ్‌.. యూరియా కోసం యాప్‌లు తెచ్చి రేవంత్‌ సర్కారు రైతుల ఉసురు పోసుకుని, వారిని బిచ్చగాళ్లుగా మారుస్తోందని ధ్వజమెత్తారు. నర్మెట్టలో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభానికి సీఎం రేవంత్‌ వస్తే బాగుంటుందని, సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో 22 వేల మంది రైతులకు రుణ మాఫీ చేసేదాక ఆందోళన చేస్తానని చెప్పారు. కోపం ఉంటే తనపై చూపాలని, సిద్దిపేట ప్రజలపై కాదన్నారు. 40 ఏళ్ల సిద్దిపేట ప్రజల కలను కేసీఆర్‌ నిజం చేసి జిల్లా ఇచ్చారన్న హరీశ్‌.. ఎక్కువ జిల్లాల సాకుతో సిద్దిపేట జిల్లాను రద్దు చేసి సంగారెడ్డిలో కలపాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా సిద్దిపేట అస్తిత్వాన్ని కాపాడుకుంటామన్నారు. మరోవైపు, ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ప్రభుత్వోద్యోగ నోటిఫికేషన్ల జారీలో విఫలమైన రేవంత్‌ సర్కారు.. వరుసగా పరీక్ష పత్రాలను లీక్‌ చేస్తూ నిరుద్యోగులను బలి తీసుకుంటోందన్నారు. జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీలో ప్రశ్నపత్రాల లీక్‌, అంతకు ముందు పీజీ వైద్య విద్య పరీక్షల స్కామ్‌.. ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమన్నారు. ’

Updated Date - Jan 10 , 2026 | 05:13 AM