దమ్ముంటే వెంటనే రైతుబంధు ఇవ్వండి
ABN , Publish Date - Feb 06 , 2026 | 04:12 AM
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇప్పటివరకు ఎగ్గొట్టిన రైతుబంధుతో పాటు ఈ సీజన్‌ది కూడా రైతులకు ఇవ్వాలని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్‌కు లేఖ ఇస్తామని బీఆర్‌ఎస్ శాసనసభా....
కేసీఆర్ జాతిపిత అయితే రేవంత్ రెడ్డి బూతుపిత
హార్వర్డ్ కాదు.. అంతరిక్షానికెళ్లినా రేవంత్ మారరు
2025లో నెలకో స్కామ్‌తో ప్రజాధనం లూఠీ చేశారు
బీజేపీతో చీకటి ఒప్పందం వల్లే అవినీతిపై విచారణల్లేవు
బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు
హైదరాబాద్/గజ్వేల్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇప్పటివరకు ఎగ్గొట్టిన రైతుబంధుతో పాటు ఈ సీజన్‌ది కూడా రైతులకు ఇవ్వాలని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్‌కు లేఖ ఇస్తామని బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలను లెక్కచేయని కేసీఆర్ జాతిపిత అయితే.. మాట మాట్లాడితే బూతులతో విరుచుకుపడే రేవంత్ రెడ్డి బూతుపిత అని విమర్శించారు. రేవంత్ హార్వర్డ్ కాదు అంతరిక్షం పోయినా మారరన్నారు. ఈ బూతుల సీఎం భాష, ప్రవర్తన తెలంగాణ సంస్కృతికే మాయని మచ్చన్నారు. కేసీఆర్‌ను జాతిపిత అన్నందుకు సీఎం తన కడుపులో ఉన్న విషమంతా కక్కుతున్నారని విమర్శించారు. కష్టపడి స్వరాష్ట్రాన్ని సాధిస్తే రేవంత్ సర్వనాశనం చేస్తున్నారన్నారు. గురువారం హరీశ్‌రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో, సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. స్కామ్ క్యాలెండర్లు తప్ప జాబ్ క్యాలెండర్లు ఇవ్వలేని రేవంత్.. 2025లో నెలకో స్కామ్‌కు పాల్పడి ప్రజాధనాన్ని లూఠీ చేశారని ఆరోపించారు. రేవంత్ తన కుర్చీని కాపాడుకునేందుకు బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని, అందుకే కాంగ్రెస్ కుంభకోణాలను బీజేపీ పట్టిం చుకోవడంలేదన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి ఇంటిపై ఐటీ, ఈడీ దాడులు జరిగితే ఆ వివరాలు ఎందుకు బయటకురావడం లేదన్నారు. బీజేపీ వాళ్లు అక్షింతలు తప్ప ఏమీ ఇవ్వరని విమర్శించారు.