’మూణ్నెల్లు ఇరిగేషన్‌ను అప్పగించు
ABN , Publish Date - Jul 09 , 2026 | 05:15 AM
‘నీకు కేసీఆర్ అవసరం లేదు.. నేను చాలు. నాకు మూడు నెలల పాటు ఇరిగేషన్ శాఖను అప్పగించు... నీళ్లు ఎలా తేవాలో నీకు చూపిస్తా. ఒకవేళ తేలేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా..
నీళ్లు తేకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతా
సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్
సమ్మక్క బ్యారేజీపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం
తుమ్మిడిహట్టికి మహారాష్ట్ర అనుమతించినట్లు ఆధారం చూపితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా
రేవంత్‌రెడ్డి గద్దె దిగడం.. కేసీఆర్ సీఎం కావడం ఖాయం
రేవంత్, ఉత్తమ్‌లను ఉరి తీసినా పాపం లేదు
బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు వ్యాఖ్యలు
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ‘నీకు కేసీఆర్ అవసరం లేదు.. నేను చాలు. నాకు మూడు నెలల పాటు ఇరిగేషన్ శాఖను అప్పగించు... నీళ్లు ఎలా తేవాలో నీకు చూపిస్తా. ఒకవేళ తేలేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఇందుకు నువ్వు సిద్ధమేనా?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాలు విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచమంతా చుక్క చుక్క నీటిని ఒడిసిపడుతుంటే... రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ. గోదావరి జలాలను రేవంత్‌రెడ్డి వృథాగా కిందకు జారవిడుస్తున్నారని ఆరోపించారు. గోదావరి నదిలో సమ్మక్క బ్యారేజీ వద్ద నిమిషానికి లక్ష క్యూసెక్కుల వరద ఉంటే.. దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా 2,542 క్యూసెక్కుల నీటిని మాత్రమే ఎందుకు లిఫ్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. సమ్మక్క బ్యారేజీ వద్ద 76 మీటర్ల ఎత్తులో నీళ్లున్నాయని, 71 మీటర్ల వద్దే దేవాదుల మోటార్లను నడపొచ్చని తెలిపారు. అయినా వాటిని ఆన్ చేయకపోవడంలో రేవంత్, ఉత్తమ్‌లది నేరపూరిత నిర్లక్ష్యమేనని వారిని ఉరి తీసినా పాపం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకోవడానికే పొలాలను ఎండబెడుతున్నారని ఆరోపించారు. గోదావరిలో ఇంత వరద ఉన్నా... ఉమ్మడి వరంగల్ జిల్లాలో 75 నుంచి 80 శాతం చెరువులు ఎండిపోయి ఎడారిలా మారుతోందని.. ఇద్దరు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదేమన్నారు.
అబద్దాలకు అంగీ లాగు వేస్తే రేవంత్‌రెడ్డి..
‘ సమ్మక్క బ్యారేజీపై చర్చకు అసెంబ్లీ నిర్వహిస్తారా? నేను సిద్ధంగా ఉన్నాను. అబద్దాలకు నోబెల్ బహుమతి ఉంటే అది రేవంత్‌రెడ్డికే వస్తుంది. అబద్దాలకు అంగీ లాగు వేస్తే అది రేవంత్‌రెడ్డి... ఆయన పేరును అనుముల రేవంత్‌రెడ్డికి బదులు అబద్దాల రేవంత్‌రెడ్డి అని మార్చుకుంటే సరిపోతుంది’ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తుమ్మిడిహట్టికి కాంగ్రెస్ హయాంలోనే అనుమతులు వచ్చాయంటూ రేవంత్‌రెడ్డి అసత్యాలు చెబుతున్నారని, ఢిల్లీలో, మహారాష్ట్ర, ఆంధ్రలలో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా సీడబ్ల్యూసీ అనుమతి ఎందుకు రాలేదన్నారు. తుమ్మిడిహట్టికి రూ.6వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని, పనులు జరగకుండానే సర్వేలు, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో రూ.2,328 కోట్లను పందికొక్కుల్లా మెక్కారని ఆరోపించారు. తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తు బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అనుమతి ఇచ్చినట్లు ఒక్క ఆధారాన్ని బయటపెట్టినా... తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. లేదంటే రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కాళేశ్వరానికి 18 కేంద్ర సంస్థల నుంచి అనుమతులు వచ్చాయన్నారు. ప్రాజెక్టు నీటి వినియోగం 160 నుంచి 240 టీఎంసీలకు పెరిగిందని, ఆయకట్టు 16 లక్షల నుంచి 37 లక్షలకు పెరిగిందని, ప్రాణహితలో ఎకరాకు రూ.2 లక్షలు నష్టపరిహారం ఇస్తే... తాము రూ.16లక్షలు ఇచ్చామన్నారు. జలాశయాల సామర్థ్యాన్ని 141టీఎంసీలకు పెంచామని, ఆ మేరకు ఖర్చు పెరగదా అన్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గతంలో రూ.1400కోట్లతో జీఓ ఇస్తే... ఇప్పుడు దాన్ని రూ.4,350 కోట్లకు ఎందుకు పెంచారో సీఎం చెప్పాలన్నారు. కాళేశ్వరమే లేకుంటే మూసీకి నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారు.. మేడిగడ్డ కొట్టుకుపోతే సుందిళ్లకు నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఇంకో ఏడాదైతే కేసీఆర్ సీఎం కావడం ఖాయమని, ఆ తర్వాత మేడిగడ్డకు రిపేర్ చేసి.. తెలంగాణకు నీరు అందిస్తామన్నారు.