ఇందిరమ్మ రాజ్యం కాదు.. హిట్లర్ రాజ్యం:హరీశ్
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:42 AM
రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ రాజ్యం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇక్కడ ఉన్నది హిట్లర్ రాజ్యమని, సాక్షాత్తూ ...
ఖమ్మం/అశ్వారావుపేటరూరల్/కొత్తగూడెం, జూన్ 23((ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ రాజ్యం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇక్కడ ఉన్నది హిట్లర్ రాజ్యమని, సాక్షాత్తూ ముఖ్యమంత్రే తనకు హిట్లర్ ఆదర్శమని చెబుతున్నారు. హిట్లర్‌ను చూసే హైడ్రా పెట్టానని చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శనం’’ అని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఖమ్మంలో, భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బీఆర్‌ఎస్ కార్యకర్తలకు నిర్వహించిన అవగాహన సదస్సులో, కొత్తగూడెం క్లబ్‌లో టీజీబీకేఎస్ ఆధ్వర్యంలో జరిగిన ‘సింగరేణి పరిరక్షణ’ సదస్సులో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు కట్టుకున్న ఇళ్లను కూలుస్తూ, పట్టాలను రద్దు చేస్తూ అన్యాయంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రెవెన్యూ మంత్రి జిల్లాలోనే పేదలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకునేవారే లేరన్నారు. రాష్ట్రంలో ఇళ్లుకూల్చే ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందడంలేదని, కేసీఆర్ ప్రభుత్వంలో ఖమ్మం జర్నలిస్టులకు క్యాబినెట్ ఆమోదంతో జీవో ఇచ్చి స్థలం కేటాయిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఆస్థలానికి ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ బోర్డు పెట్టిందన్నారు. తక్షణం ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మధిరలో ఈనెల 30న నిర్వహించే రైతు ఆశీర్వాదసభకు రైతు క్షమాపణ సభగా నామకరణం చేయాలని సూచించారు. రాష్ట్రానికి వెలుగులు నింపిన సింగరేణి ఒకప్పుడు సిరులగనిగా ఉండేదని.. ప్రస్తుతం స్కాంల గనిగా మారిందని ఆరోపించారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైన విషయం బయటకొచ్చిన దగ్గరనుంచి ఉత్పత్తి తగ్గించి చూపిస్తున్నారని, నిజంగా గనుల్లో బొగ్గు నిల్వలుంటే చూపించడానికి ఏమయిందని ప్రశ్నించారు.