Share News

సింగరేణిని కాంగ్రెస్‌ ఖతం పట్టించింది

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:55 AM

అవినీతి, కుంభకోణాలతో సింగరేణి సంస్థను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖతం పట్టించిందని బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు.

సింగరేణిని కాంగ్రెస్‌ ఖతం పట్టించింది

  • కిషన్‌రెడ్డి.. సింగరేణి అవినీతిలో మీ భాగస్వామ్యం ఏమిటి?

  • రేవంత్‌రెడ్డిది ‘జల ద్రోహం’.. ఏపీకి గోదావరి నీళ్లు తరలించే కుట్ర: హరీశ్‌రావు

గోదావరిఖని/పెద్దపల్లి/హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): అవినీతి, కుంభకోణాలతో సింగరేణి సంస్థను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖతం పట్టించిందని బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. ఇంతగా అవినీతి జరుగుతున్నా కేంద్ర ఇంధన శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సింగరేణి కుంభకోణాల్లో రేవంత్‌రెడ్డితో మీకున్న భాగస్వామ్యం ఏమిటని కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈడీ, విజిలెన్స్‌లతో విచారణ జరిపిస్తే సింగరేణిలో జరిగిన అవినీతిపై పూర్తి ఆధారాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని చె ప్పారు. ఆదివారం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎన్‌టీపీసీలోని ప్రైవేట్‌ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సులో హరీశ్‌ రావు సింగరేణిపై రెండు గంటలపాటు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నియోజకవర్గ స్థాయి బీఆర్‌ఎస్‌ ముఖ్యకార్తల సమావేశంలో, హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లోనూ ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49శాతం వాటా ఉన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. కేసీఆర్‌ హయాంలో 19,500మందికి డిపెండెంట్‌ ఉద్యోగాల కల్పన జరిగితే కాంగ్రెస్‌ ఏడాదిన్నరగా మెడికల్‌ బోర్డును నిలిపివేసి సింగరేణిలో కొత్త ఉద్యోగాల్లో కోత పెట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో తెలంగాణ జల హక్కులను పొరుగు రాష్ట్రానికి తాకట్టు పెడుతోందని, సీఎం రేవంత్‌ రెడ్డి ఉద్దేశపూర్వకంగా తెలంగాణ జల ద్రోహానికి పాల్పడుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. నదుల అనుసంధానం పేరుతో మన రాష్ట్రాన్ని పక్కన పెట్టి.. రాత్రికి రాత్రి ఏపీకి గోదావరి జలాలను తరలించే కుట్ర జరుగుతోందన్నారు. బనకచర్ల నల్లమలసాగర్‌ ఫె యిల్‌ కావడంతో ఇప్పుడు గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్టు పేరుతో ముందుకు వచ్చారన్నారు. ఏపీ ప్రతిపాదనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఇతర బీజేపీ ఎంపీలు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారా? అని నిలదీశారు.


హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్‌కు..

హిట్లర్‌ను చూసి హైడ్రా తెచ్చాను అంటున్న సీఎం రేవంత్‌ రెడ్డి నయా హిట్లర్‌గా మారాడని, నాడు హిట్లర్‌కు ఏ గతి పట్టిందో.. రేవంత్‌ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని హరీశ్‌ రావు అన్నారు. రైతు డిస్కం పేరుతో 24 గంటల ఉచిత కరెంటుకు ఉరి వేయబోతున్నారని చెప్పారు. ఇక వ్యవసాయానికి 7, 8 గంటలకు మించి కరెంట్‌ రాదని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 06:56 AM