హరీశ్ రావు అరెస్టు
ABN , Publish Date - Apr 08 , 2026 | 06:05 AM
వికారాబాద్ జిల్లా పరిగి పర్యటనకు వెళ్లకుండా బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఇండస్ట్రియల్ పార్కు కోసం తమ భూములు...
పరిగిలో రైతుల దీక్షలకు..వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
అప్పా చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ ఆందోళన
రేవంత్ రెడ్డిది రాక్షస పాలన: హరీశ్ రావు
నార్సింగ్/శంషాబాద్ రూరల్/వికారాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా పరిగి పర్యటనకు వెళ్లకుండా బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఇండస్ట్రియల్ పార్కు కోసం తమ భూములు ఇచ్చేదే లేదని పరిగి మండలంకాడ్లాపూర్, రాపోల్ గ్రామాల రైతులు 15 రోజులుగా కాళ్లాపూర్‌లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలకు సంఘీభావం తెలపడానికి హరీశ్ రావు పరిగి వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్ కోకాపేటలోని తన ఇంటినుంచి ఉదయం బయటకు వెళ్లకుంగా హారీశ్ రావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీంతో హరీశ్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపటి తర్వాత హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితాఇంద్రారెడ్డి పరిగి పర్యటనకు బయలుదేరగా.. అప్పా చౌరస్తాలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావుతో పాటు బీఆర్‌ఎస్ నేతలు అక్కడే ధర్నాకు దిగగా.. గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం హరీశ్‌తో పాటు ఎర్రబెల్లి, సబిత తదితరులను పోలీసులు అరెస్టు చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రైతులు పండించే భూములను లాక్కోవడంపై ఉన్న శ్రద్ధ పాలనపై ఏదని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పిన రేవంత్.. 900 రోజులైనా ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిది రాక్షస పాలన అని అన్ని వర్గాల వారు అంటు న్నారని ఆయన అన్నారు.
పరిగి పీఎస్ వద్ద ఉద్రిక్తత
హరీశ్‌రావు పర్యటనకు అనుమతి కోసం కాడ్లాపూర్ సర్పంచ్, పలువురు గ్రామస్తులు సోమవారం పరిగి పీఎస్‌కు వెళ్లగా.. వారిని బయటకు వెళ్లకుండా పోలీసులు అక్కడే నిర్భంధించడంతో ఉద్రిక్తత నెల కొంది. తమ నేతలు తిరిగిరాకపోవడంతో అర్ధరాత్రి రైతులు, మహిళలు అధిక సంఖ్యలో వెళ్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. లోపలికి వెళ్లి బైఠాయించారు. నిర్బంధంలో ఉన్న వారిని పోలీసులు వదిలిపెట్టడంతో ఆందోళన సద్దుమణిగింది.