Harish Rao: సైట్ విజిట్‌తో భారీ స్కామ్!
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:20 AM
సింగరేణి సంస్థను అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతికి అడ్డాగా మార్చేసిందని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు.
సింగరేణి సంస్థను అవినీతికి అడ్డాగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం
కమీషన్ల కోసమే కొత్త విధానం
సీఎం, మంత్రుల మధ్య ముదిరినవాటాల పంచాయితీ
కాంగ్రెస్ బొగ్గుస్కామ్‌పై న్యాయపోరాటం చేస్తాం: హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థను అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతికి అడ్డాగా మార్చేసిందని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. కాంట్రాక్టర్లు సైట్ విజిట్ సర్టిఫికెట్ పొందాలన్న నిబంధన విధించడం ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి భారీ స్కామ్‌కు తెగబడ్డారని అన్నారు. ఈ నిబంధన ఎప్పుడూ లేదని, వెస్టన్ కోల్‌ఫీల్డ్, కోల్ ఇండియాలో కూడా లేదని తెలిపారు. తమ అనుయాయులకు టెండర్లు దక్కించుకొని కమీషన్లు దండుకోవాలన్న ఉద్దేశంతోనే రేవంత్ ప్రభుత్వం ఈ నిబంధన తెచ్చిందని ఆరోపించారు. నైనీ బ్లాక్‌లో ఇదే జరిగిందని, వాటాల కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన సాగుతోందని, ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య వాటాల పంచాయతీలు ముదిరిపోయాయని అన్నారు. ఆన్‌లైన్ ద్వారా దేశంలో ఎవరైనా టెండర్లు వేయొచ్చునని, అయితే ఈ కొత్త విధానంలో ముందే వెళ్లి సైట్ విజిట్ చేసి సింగరేణి నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీంతో ఎవరు టెండర్ వేస్తున్నారో ముందుగానే తెలుసుకొని, బెదిరించి, భయపెట్టి వారికి టెండర్ దక్కకుండా చేసి.. తమ అనుయాయకులకు ప్లస్ 7 నుంచి ప్లస్ 20 శాతానికి కట్టబెట్టి, కమీషన్లు కొల్లగొట్టారని ఆరోపించారు. ఈ విధానం వచ్చాక సీఎం బావమరిది సుజన్‌రెడ్డి లబ్ధి పొందారని, ఆయన కంపెనీ శోధా కన్‌స్ట్రక్షన్స్‌కే మొదటి టెండర్ దక్కిందని తెలిపారు. ఇలా సింగరేణిలో ఆరు టెండర్లను ప్లస్ 7 పర్సంటేజీకి వారి అనుయాయులకు కట్టబెట్టారని తెలిపారు.
మైనస్ నుంచి ప్లస్ శాతానికి పెంచారు..
దేశంలో ఎక్కడ ఓబీ కోల్ బ్లాక్ టెండర్ జరిగినా.. మైనస్ 10 నుంచి మైనస్ 22 శాతానికి పోతుందని హరీశ్‌రావు చెప్పారు. అలాంటిది.. ఈ ప్రభుత్వం కొత్త విధానం తెచ్చాక అన్ని టెండర్లు ప్లస్ 7 నుంచి ప్లస్ 10 శాతానికి దక్కించుకుంటున్నారని అన్నారు. నైనీ బ్లాక్ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారని, కానీ.. గతంలో ఇదే సింగరేణిలో బీఆర్‌ఎస్ సమయంలో ఉన్న టెండర్లను రద్దు చేసి, వాటినే తమ అనుయాయులకు అప్పజెప్పారని గుర్తు చేశారు. గతంలో వెంకటేశన్ ఖని అనే టెండర్ మైనస్ 7 ఉంటే, ఇప్పుడు ప్లస్ 7మీద రీ టెండర్ చేసి మరొకరికి కట్టబెట్టారని తెలిపారు. ఎస్‌ఆర్‌పీఏసీటూ శ్రీరాంపూర్ అనే మైనస్ 7 టెండర్‌ను రద్దుచేసి, ప్లస్ 7లో అప్పగించారని చెప్పారు. ఎస్‌ఆర్‌పీవోసీటూ విస్తరణ 2025 టెండర్ మూడుసార్లు వాయిదా వేశారని, డీల్ కుదరక మళ్లీ వారి అనుయాయులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డీజిల్‌ను కూడా గతంలో సింగరేణి బల్క్‌లో ఐఓసీఎల్ నుంచి సరఫరా చేసేదని, ప్రస్తుత సర్కారు ఈ విధానాన్ని సైతం రద్దుచేసి కమీషన్ల కోసం డీజిల్‌ను కూడా కాంట్రాక్టర్లకు అప్పగించిందని వెల్లడించారు. చేసిన పనిమీదనే కాకుండా.. డీజీల్ కూడా కలుపుకొని సంస్థ జీఎస్టీ కట్టాల్సి వస్తోందని తెలిపారు. సింగరేణిలో ఇటీవల అక్రమంగా కట్టబెట్టిన అన్ని టెండర్లనూ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సైట్ విజిట్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని, డీజిల్ విధానం మార్చాలని, సింగరేణికి సీనియర్ అధికారిని రెగ్యులర్ సీఎండీగా నియమించాలని అన్నారు.
దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకోవాలి
సింగరేణి టెండర్ల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య జరుగుతున్నది వాటాల పంచాయితీ కాదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. వీరి మధ్యలో ఐఏఎస్, జర్నలిస్టులు బలి పశువులు అయ్యారన్నారు. చీటికీ మాటికీ సిట్ అంటూ వేధింపులకు పాల్పడుతున్న రేవంత్‌రెడ్డి.. దమ్ముంటే బొగ్గు కుంభకోణాలపై సీబీఐ విచారణకు ఒప్పుకోవాలని సవాల్ చేశారు. తెలంగాణ సీఎంతో బీజేపీకి చీకటి ఒప్పందాలు లేకపోతే.. సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని డిమాండ్ చేశారు. అన్ని విషయాలు బయట పెడుతామన్న భట్టి విక్రమార్క తన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుంభకోణం బయట పడేవరకు వదలబోమని, దీనిపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని చెప్పారు.
హౌలా మాటలు బంద్ చేసి.. ఆరు గ్యారంటీలపై దృష్టి పెట్టు!
‘‘బీఆర్‌ఎస్ గద్దెలను కూలుస్తానంటున్నావ్. నువ్వు కూలిస్తే కూలిపోయే పరిస్థితిలో లేం. ప్రజల గుండెల్లో ఉన్న మా పార్టీ జోలికొస్తే నీ గద్దె కూలుతుంది జాగ్రత్త!’’ అని హరీశ్‌రావు.. సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. హింసను ప్రేరేపించేలా రేవంత్ వ్యాఖ్యలు చేస్తుంటే డీజీపీ శివధర్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘మీ ఖాకీ బుక్కును కాకి ఎత్తుకుపోయిందా? అని నిలదీశారు. జర్నలిస్టులను బెదిరించిన సజ్జనార్ హూంకరింపులు ఏమయ్యాయన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటేందుకు ఎన్‌టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారని, ఆ పార్టీ పుట్టుకే కాంగ్రె్‌సకు వ్యతిరేకమని అన్నారు. అలాంటి టీడీపీ నుంచి బయటకు వచ్చి ద్రోహం చేసిన రేవంత్‌రెడ్డి.. నాలుగు ఓట్ల కోసం ఆ పార్టీ తరఫున మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే.. నువ్వేమో బీజేపీతో, చంద్రబాబుతో కలిసిపోయి.. కాంగ్రెస్ ఔట్‌సోర్సింగ్ సీఎంలా వ్యవహరిస్తున్నావ్. మీ ఉప ముఖ్యమంత్రి భట్టి తాను వైఎస్సార్ అభిమానినంటున్నారు. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన ఆ ఇద్దరు నేతలే తమకు సర్వస్వమంటున్న సీఎం, డిప్యూటీ సీఎం.. తెలంగాణ సమాజానికి ఏం చెబుతున్నారు?’’ అని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి హౌలా మాటలు బంద్‌చేసి.. ఇప్పటికైనా ఆరు గ్యారెంటీల మీద దృష్టిపెట్టాలని సూచించారు.