Share News

సర్‌ పేరిట ఓట్లు తొలగించే కుట్ర

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:29 AM

దేశవ్యాప్తంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ పేరుతో పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తూ కొన్ని రాజకీయ పార్టీలను దెబ్బతీస్తోందని...

సర్‌ పేరిట ఓట్లు తొలగించే కుట్ర

  • బీఆర్‌ఎస్‌ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి : హరీశ్‌ రావు

హనుమకొండ టౌన్‌, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ పేరుతో పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తూ కొన్ని రాజకీయ పార్టీలను దెబ్బతీస్తోందని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు ఆరోపించారు. ఆదివారం హనుమకొండలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా మొదటి దశలో ఫ్యామిలీ గ్రూప్‌ వింగ్‌ ప్రక్రియ జరుగుతోందని పేర్కొన్నారు. 2002లో ఓటు హక్కు కలిగి ఉన్నట్లు ఆధారం ఉంటే మిగిలిన కుటుంబ సభ్యుల వివరాలను కూడా అందులోనే చేర్చుతారని తెలిపారు. ఫ్యామిలీ గ్రూపింగ్‌ పూర్తయితే ఓట్లన్నీ బాగానే ఉన్నట్లేనని పేర్కొన్నారు. ఓట్ల తొలగింపుపై బీఆర్‌ఎస్‌ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సహకరించకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో 60 లక్షలు, తమిళనాడులో 40 లక్షల ఓట్లు తొలగించారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ అభిమానుల ఓట్లను తొలగిస్తే హైకో ర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పోయి.. కేసీఆర్‌ ప్రభుత్వం రావాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని పథకాలలో స్కాములు జరుగుతున్నాయని ఆరోపించారు. సింగరేణిలో మాయమైన 40లక్షల టన్నుల బొగ్గుపై ఆధారాలతో బయటపెట్టాలని, లేకుంటే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మాయమైన బొగ్గుపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పట్టించుకోవడలేదన్నారు. దొంగచేతికి తాళం ఇచ్చినట్లు బొగ్గు మాయంపై విచారణ చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు.

Updated Date - Jun 15 , 2026 | 04:29 AM