సీఎం, మంత్రులు సహా కాంగ్రెస్ నేతల అధికార దుర్వినియోగం
ABN , Publish Date - Feb 12 , 2026 | 03:07 AM
మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ నేతలంతా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ...
వారివి అరాచక రాజకీయాలు: హరీశ్ రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ నేతలంతా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా తప్పుడు చర్యలకు పాల్పడ్డారని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియనుంచి పోలింగ్ ముగిసే వరకు కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ అరాచకాలకు తెగబడ్డాయని బుధవారం ఎక్స్ వేదికగా ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి నుంచి క్షేత్రస్థాయి నాయకుల వరకు అందరూ అధికార మదంతో చట్టాన్ని చుట్టంలా వాడుకున్నారన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా, వారిపై భౌతిక దాడులకు తెగబడటం నీచమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. డబ్బు సంచులు, కుట్రలు, కుతంత్రాలతో ప్రజాతీర్పును ప్రభావితం చేయాలని కాంగ్రెస్ చూస్తోందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానమని పేర్కొన్నారు. కొందరు పోలీసు అధికారులు చట్టాన్ని అమలు చేయాల్సింది పోయి, అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తారని ధ్వజమెత్తారు. అధికారపార్టీ ఎన్ని అకృత్యాలకు పాల్పడినా అదరకుండా, బెదరకుండా గులాబీ జెండా గెలుపు కోసం పాటుపడ్డ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇన్‌చార్జులకు అభినందనలు తెలిపారు.