Share News

రేవంత్‌ కుటుంబసభ్యులకు 308 ఎకరాలు

ABN , Publish Date - Sep 17 , 2026 | 02:46 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల పేరున ఏకంగా 308 ఎకరాల భూములున్నాయని.. దీనికి సంబంధించి తమవద్ద పక్కా ఆధారాలున్నాయని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు సంచలన ఆరోపణలు చేశారు.

రేవంత్‌ కుటుంబసభ్యులకు  308 ఎకరాలు
harishrao

  • వాటి చుట్టే ఆర్‌ఆర్‌ఆర్‌, బుల్లెట్‌ రైలు అలైన్‌మెంట్లు

  • దీనిపై మా దగ్గర పక్కా ఆధారాలున్నాయ్‌

  • సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

  • మూడేళ్లలో రేవంత్‌ వెనకేసిన ఆస్తుల లెక్క తేల్చాలి

  • ధరణి, భూభారతిపైనా విచారణ జరిపించాలి

  • నా ఆస్తులపైనా విచారణకు సిద్ధమే: హరీశ్‌రావు

  • 22ఏ భూములపై శ్వేతపత్రం విడుదలకు డిమాండ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల పేరున ఏకంగా 308 ఎకరాల భూములున్నాయని.. దీనికి సంబంధించి తమవద్ద పక్కా ఆధారాలున్నాయని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్‌ భూముల సమీపం నుంచే రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌, అలాగే బుల్లెట్‌ ట్రెయిన్‌ అలైన్‌మెంట్‌ వెళ్లేలా ప్లాన్లు రూపొందించుకున్నారని హరీశ్‌రావు అన్నారు.‘నిజంగా రేవంత్‌రెడ్డికి నైతికత ఉంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టాక ఈ మూడేళ్లలో ఆయన సంపాదించిన ఆస్తులతోపాటు, మా ఆస్తులు.. ధరణి-భూభారతిలో జరిగిన వ్యవహారాల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమా?’’ అని సవాల్‌ విసిరారు. బుధవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతోమాట్లాడారు. తనపై, తన ఆస్తులపై సీఎం చేసిన అసత్య ఆరోపణలను హరీశ్‌రావు ఈ సందర్భంగా తిప్పికొట్టారు. రేవంత్‌రెడ్డి, ఆయన కూతురు, తమ్ముళ్ల పేరుతో 308 ఎకరాల భూములు ఉన్నాయని చెప్పారు. ఒక్క కొట్రా గ్రామంలోనే 300 ఎకరాలు ఉన్నాయని రైతులు చెబుతుండగా.. అందులో 175 ఎకరాలకు సంబంధించి డాక్యుమెంట్లు తమ దగ్గర ఉన్నాయని ప్రకటించారు. దానికి తోడు కొండారెడ్డిపల్లిలో 77ఎకరాలు, అఫిడవిట్‌లో ప్రకటించిన మరో 54ఎకరాలు.. మొత్తం 308ఎకరాలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు.


‘ నాదర్‌గుల్‌లో రూ.10వేల కోట్ల విలువైన భూకుంభకోణాన్ని సాక్ష్యాధారాలతో బయటపెడితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదన్నారు. సీఎం సోదరుడికి చెందిన టెస్సరాక్ట్‌ కంపెనీకి కోట్ల విలువైన భూముల కేటాయింపు, పసుమాములలో మరో సోదరుడి భూమి నాలా కన్వర్షన్‌పై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. భూభారతిలో 9200కు పైగా భూముల రిజిస్ట్రేషన్లు యజమానులు తెలియకుండానే జరిగిపోయాయన్నారు. గజ్వేల్‌లో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళ భూమి ఆమెకు తెలియకుండానే బదిలీ అయిందన్నారు. పొరపాట్లను సరిదిద్దాల్సిందిపోయి, భూభారతి పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడుతోందని హరీశ్‌ ఆరోపించారు. సీఎం ఇల్లు రాత్రికి రాత్రి 22ఏ జాబితా నుంచి ఎలా తొలగించారో.. అదేవిధంగా ప్రజల ఆస్తులను కూడా 22ఏనుంచి తొలగించాలన్నారు. ‘‘కాంగ్రెస్‌ వచ్చిన తర్వాత ఒక్క ఎకరా కూడా నిషేధిత జాబితాలో పెట్టలేదని మంత్రి పొంగులేటి అంటుంటే.. అధికారులే 30లక్షల ఎకరాలను పొరపాటుగా అప్‌లోడ్‌ చేశారని సీఎం చెబుతున్నారు. ఇందులో ఎవరు చెప్పేది నిజం’’అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్‌ అధికారం చేపట్టాక ఎన్ని భూములు నిషేధిత జాబితాలో పెట్టారు? ఎన్నింటిని జాబితా నుంచి తొలగించారన్న దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. తాము సభలోఉంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం కుంభకోణాలు, సీఎం కుటుంబ అవినీతి బయటపడుతుందన్న భయంతోనే మొత్తం సెషన్‌ నుంచి సస్పెండ్‌ చేశారని హరీశ్‌ ఆరోపించారు.

అదనంగా ఒక్క గుంట కూడా నాకు లేదు

ఎన్నికల అఫిడవిట్‌, ఇన్‌కమ్‌టాక్స్‌ రిటర్నుల్లో పేర్కొన్న భూములకు అదనంగా, ఒక్క గుంటకూడా తనకు లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తన బంధువులు చట్టబద్ధంగానే 2019లో ‘రాజ్‌ బ్రీడర్స్‌’ అనే కంపెనీ షేర్లను బ్యాంకు చెక్కులద్వారా కొనుగోలు చేశారన్నారు. కేసీఆర్‌కు 1000 ఎకరాల ఫామ్‌హౌస్‌ ఉందని మొన్నటిదాకా అబద్ధాలు చెప్పిన సీఎం రేవంత్‌.. ఇప్పుడు 67 ఎకరాలు అంటున్నారని పేర్కొన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 02:47 AM