సీఎం బాగోతం బయటకు రాకూడదనే
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:48 AM
సింగరేణి కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన బావమరిది బాగోతం బయటకు రాకుండా ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అసెంబ్లీలో బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు.
బొగ్గు కుంభకోణం నుంచి రేవంత్‌ను బయటపడేసేందుకు భట్టి విఫలయత్నం
6 వేల కోట్ల సింగరేణి నిధుల స్కాంను త్వరలో బయటపెడతా: హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన బావమరిది బాగోతం బయటకు రాకుండా ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అసెంబ్లీలో బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. తనకు లేఖ రాస్తే రేవంత్ రెడ్డితో మాట్లాడతానని భట్టివిక్రమార్క అనడం విచిత్రంగా ఉందని, సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఈ అవినీతికి సూత్రధారి అని తాము చెబుతుంటే ఆయనతో మాట్లాడితే ఏం ప్రయోజనమని హరీశ్ ప్రశ్నించారు. భట్టి మొన్నటి ప్రెస్ మీట్‌లో బొగ్గు కుంభకోణంపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా తన మాటల గారడీతో, నాలుగు కాగితాలు చూపి మసి పూసి మారేడు కాయ చేశారని విమర్శించారు. తన 40 ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రిని బొగ్గు స్కాం నుంచి బయటపడేసేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో హరీశ్ మీడియాతో మాట్లాడారు. భట్టి ఓబీ రిమూవల్ కాంట్రాక్టు పద్ధతికి వర్తించని నిబంధనలు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ కూడా ఓబీ పనులకు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం లేనేలేదన్నారు. ‘సైనిక్ స్కూల్ వాళ్ళు ఒక టెండర్ పిలిచారు. ఇందులో క్లాత్ డ్రైయర్ సరఫరా, ఏర్పాటు కోసం సైట్ విజిట్ పెట్టారు. దాన్ని తీసుకొచ్చి సింగరేణి ఓబీ కాంట్రాక్టుకు లింకు పెట్టి చూపడం హాస్యాస్పదమ’ని పేర్కొన్నారు. సైనిక్ స్కూళ్లలో బట్టలు ఆరబెట్టే మిషన్ల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనను సింగరేణి సంస్థలో ఓబీ టెండర్లకు ముడిపెట్టి భారీ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. టెండర్లలో పోటీని తగ్గించి, తమ అనుయాయులకు పనులు కట్టబెట్టేందుకు ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే వింత నిబంధన తెచ్చారన్నారు. 2018 నుంచి 2024 వరకు ఓబీ టెండర్లలో ఈ షరతు లేదని, మరి ఇప్పుడు 2025-26లో మాత్రమే అదీ కొన్ని ఎంపిక చేసిన టెండర్లకే అకస్మాత్తుగా ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ‘మే 2025 నుంచి ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్లు సందర్శించారు, ఎన్ని ఈమెయిల్స్, లేఖలు వచ్చాయి, ఎన్ని సర్టిఫికెట్లు జారీ అయ్యాయి, మిగిలిన వాటిని కారణం చెప్పకుండా ఎందుకు తిరస్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాల’ని డిమాండ్ చేశారు. ఎన్‌సీసీ, జీఆర్‌ఎన్, మహాలక్ష్మి ఇలా ఎన్నో కంపెనీలు తమకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని మెయిల్స్ చేశాయని, వాటిని బయటపెట్టాలని, లేదంటే తానే బయటపెడతానని హరీశ్‌రావు హెచ్చరించారు.
బొగ్గు స్కాంపై నాలుగు మీడియాను సైతం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన భట్టి.. తాను ప్రస్తావించిన సోలార్ స్కామ్, పేలుడు పదార్థాల స్కామ్, ఉద్యోగుల డీ-ప్రమోషన్ వంటి కీలకాంశాలపై ఎందుకు మాట్లాడలేదని హరీశ్ ప్రశ్నించారు. 2025 మే తర్వాత ఓబీ రిమూవల్ కాంట్రాక్టర్లకు ఏ టెండర్ వచ్చినా, సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వడంలో సృజన్ రెడ్డి రింగ్ మాస్టర్ అని తాను బయటపెట్టినా కూడా స్కాం జరగలేదని భట్టి బుకాయిస్తున్నారని విమర్శించారు. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ జరిపించాలని హరీశ్ డిమాండ్ చేశారు. నిజాయితీ ఉంటే సైట్ విజిట్ సర్టిఫికెట్‌పై జరిగిన అన్ని టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఈ కుంభకోణం సూత్రధారి ఏ హోటల్లో మీటింగ్ పెట్టారో సీఎం బంధువు కూడా అదే హోటల్లో కూర్చున్న ఫొటోలు సైతం తమ దగ్గర ఉన్నాయని, సమయం వచ్చినపుడు బయటపెడతానని చెప్పారు. సింగరేణిలో చాలా స్కాములు ఉన్నాయని, వాటినీ బయటపెడతానన్నారు. ‘ఈ రెండేళ్లలో సింగరేణి అభివృద్ధి కోసం పక్కనపెట్టిన 6 వేల కోట్లు ఏమయ్యాయి?.. ఆ స్కాంను కూడా త్వరలో బయటపెడతాన’న్నారు. సింగరేణి గడించిన మొత్తం లాభం 6,394 కోట్లు అయితే, కేవలం 2,360 కోట్లేనని చూపించి కార్మికుల బోన్‌సలో కోత పెట్టారని, మిగిలిన డబ్బును సీఎం తన ప్రచారానికి వాడుకుంటున్నారని విమర్శించారు.