Share News

రైతు డిక్లరేషన్‌ను బొందపెట్టిన సర్కారు

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:21 AM

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన రైతు డిక్లరేషన్‌ హామీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బొందపెట్టిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

 రైతు డిక్లరేషన్‌ను బొందపెట్టిన సర్కారు

  • రైతు డిక్లరేషన్‌ను బొందపెట్టిన సర్కారు

  • కేంద్రం ఎంత కొంటే అంత.. అంటూ చేతులెత్తేసిన రేవంత్‌

  • ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: హరీశ్‌

సిద్దిపేట జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన రైతు డిక్లరేషన్‌ హామీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బొందపెట్టిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్వయంగా వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లో అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పారని.. ఇప్పుడు బోనస్‌ లేదని, అన్ని పంటలను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కూడా కొనుగోలు చెయ్యదని రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారని మండిపడ్డారు. కేంద్రం ఏ పంట కొనమంటే ఆ పంట, ఎంత కొనమంటే అంతే కొంటామని రేవంత్‌ సర్కారు స్పష్టం చేసిందని.. అంటే రాహుల్‌ పుట్టినరోజు సాక్షిగా ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను విస్మరించిందని చెప్పారు. ఎన్ని వడ్లు పండించినా కొంటామంటూ గతంలో రాహుల్‌, రేవంత్‌లు చెప్పిన వీడియోలను ప్రదర్శించారు. క్యాబినెట్‌ భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్‌ చెప్పినదాని ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం జొన్నలు, మక్కలు కొనదని, అంటే రేవంత్‌ సర్కారు కూడా చేతులెత్తేసినట్టేనని హరీశ్‌ చెప్పారు. కానీ, కేసీఆర్‌ ప్రభుత్వం మక్కలు, జొన్నలు కొని రైతులకు అండగా నిలిచిందన్నారు. రైతుల కష్టాన్ని దళారుల పాలు చేయాలని చూస్తున్నావా రేవంత్‌రెడ్డీ? అంటూ మండిపడ్డారు. ఇది రైతుల పట్ల విశ్వాస ఘాతుక క్యాబినెట్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల కొనుగోలుపై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని, రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇక యూరియా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 7,600 మంది రైతులు మరణిస్తే, రైతుబీమా ఎక్కడా ఆగలేదని మంత్రి తుమ్మల చెప్పడం సిగ్గుచేటన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 04:21 AM