ఉద్యోగులపై రేవంత్ సర్కార్ చిన్నచూపు: హరీశ్
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:49 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూస్తున్నది. 35 ఏళ్లు కష్టపడి పని చేసి రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను రేవంత్ రెడ్డి రోడ్లమీదకు తెచ్చారు.
సిద్దిపేట క్రైం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూస్తున్నది. 35 ఏళ్లు కష్టపడి పని చేసి రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను రేవంత్ రెడ్డి రోడ్లమీదకు తెచ్చారు. బడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తారు.. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బులు ఇస్తారు.. కానీ ఉద్యోగులకు మాత్రం ఇవ్వరు. రేవంత్ రెడ్డి కమిషన్ ఇచ్చే వారికి డబ్బులు ఇస్తారు కానీ.. కమిషన్ ఇవ్వని ఉద్యోగులకు డబ్బులు ఇవ్వరు. ఎన్ని ప్రాణాలు పోతే రేవంత్ రెడ్డి కళ్లు తెరుస్తారు?’’ అని బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్ రావు ప్రశ్నించారు.రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో చేపట్టిన నిరాహార దీక్షకు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక 60 మంది చనిపోయారని, దానికి కారణం రేవంత్ రెడ్డే అని ఆరోపించారు. ఎన్నికల ముందు పెండింగ్ డీఏలు ఇస్తామని హామీలు ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. రేవంత్‌కు మనసు లేదని, ఉద్యోగుల దాచుకున్న డబ్బు ఇవ్వడానికి మనసు రావడం లేదని విమర్శించారు.