Harish Rao: అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:23 AM
నదీ జలాల్లో తెలంగాణ వాటాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ వల్లే నష్టం జరిగిందంటూ తప్పుడు మాటలు.....
కేసీఆర్ వల్లే నష్టమంటూ తప్పుడు మాటలు
బాబుకు చెప్తే రాయలసీమ ఆపారని అబద్ధాలు
ఏపీ వాళ్లే తప్పంటున్నారు.. సిగ్గుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి
సీఎంకు కాళేశ్వరంపై కక్ష.. పాలమూరుపై పగ
28 డీపీఆర్‌లు పంపాం.. 7 అనుమతులు తెచ్చాం
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క డీపీఆర్‌నూ పంపలేదు
శ్రీశైలం, తుంగభద్రలో నీటి వాటాను దక్కించుకునేందుకే పాలమూరు-రంగారెడ్డి ఇన్‌టేక్‌ను జూరాల నుంచి మార్చాం
నన్ను అరెస్టు చేస్తారో, హత్య చేయిస్తారో!
అయినా కాంగ్రెస్ అన్యాయాన్ని ఎండగడతాం
కేసీఆర్ ఆధ్వర్యంలో మరో జలపోరాటం: హరీశ్
హైదరాబాద్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): నదీ జలాల్లో తెలంగాణ వాటాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ వల్లే నష్టం జరిగిందంటూ తప్పుడు మాటలు మాట్లాడారని, సభలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారని మండిపడ్డారు. ఏపీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను తానే ఆపించానని రేవంత్ చెబుతున్నారని, చంద్రబాబుపై ఒత్తిడి తెస్తే.. తన మాట మీద గౌరవంతో ఆయన ఈ ప్రాజెక్టు పనులు ఆపారంటూ అందరి చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తప్పు అని, 2024లో ఏపీలో కూటమి సర్కారు రాకముందే కేంద్రం ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేసినట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోందని పేర్కొన్నారు. ఇప్పుడు రేవంత్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ‘నదీ జలాలు.. కాంగ్రెస్ ద్రోహాలు’ అనే అంశంపై హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ఇచ్చారు. తెలంగాణ సాగునీటి రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందని, దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి ఆ పార్టీ ద్రోహం చేస్తూనే ఉందని ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రం, ఎన్‌జీటీతోపాటు పలుచోట్ల ఫిర్యాదులు చేస్తే.. అనుమతుల్లేని రాయలసీమ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలంటూ 2020లోనే ఆదేశాలు వచ్చాయని గుర్తుచేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో జగన్ చేపట్టే ప్రాజెక్టు నిర్మాణాలను సమర్థించారంటూ రేవంత్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయనకు సిగ్గు, శరం ఉంటే.. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు.
గోదావరిలో 383 టీఎంసీలకు హక్కులు సాధించాం..
గోదావరి నదిలో నిజాం కాలంలోనే మనకు దక్కింది 252 టీఎంసీలు అని హరీశ్‌రావు తెలిపారు. 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో 265 టీఎంసీలు దక్కితే.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక తొమ్మిదిన్నరేళ్లలో 383 టీఎంసీలకు హక్కులు సాధించామని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి ఏటా సగటున 4.43 టీఎంసీలు సాధిస్తే.. బీఆర్‌ఎస్ హయాంలో ఏటా 40 టీఎంసీలు సాధించామన్నారు. మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించామని, పాలమూరు, డిండిని కొనసాగిస్తామని కేసీఆర్ అందులోనే చెప్పారని తెలిపారు. టెలిమెట్రీలను పెట్టాలని కేసీఆర్ 2016లోనే చెప్పారని, నీళ్ల విషయంలో చంద్రబాబును, జగన్‌ను నిలదీశారని పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించిన అంశాలను పూర్తిగా చదవకుండా దాచిపెట్టి.. సగం పేరాగ్రా్‌ఫలు మాత్రమే చదివి అసెంబ్లీని రేవంత్ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. పైగా, నిర్లజ్జగా ప్రజలను సైతం మభ్యపెట్టారని అన్నారు. కేంద్ర మంత్రి, జగన్‌ల సమక్షంలోనే పోతిరెడ్డిపాడును కేసీఆర్ వ్యతిరేకించారని, ఆ ప్రాజెక్టును ఆపకపోతే అలంపూర్ వద్ద ప్రాజెక్టు నిర్మిస్తామంటూ హెచ్చరించారని గుర్తుచేశారు. అలాంటిది ఏపీ ప్రాజెక్టులకు నీటి పంపిణీకి కేసీఆర్ ఒప్పుకొన్నారంటూ.. అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ కట్టుకథలు, రేవంత్ పిట్టకథలు చెబుతున్నారని అన్నారు.
మేం 11 ప్రాజెక్టులకు డీపీఆర్ పంపాం..
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 11 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు పంపామని, అందులో 7 ప్రాజెక్టులకు అనుమతులు సాధించామని హరీశ్‌రావు తెలిపారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు పెండింగ్‌లో ఉందని, కాళేశ్వరం అదనపు టీఎంసీ అంబేద్కర్ వార్దా డీపీఆర్ వాపస్ వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక పాలమూరు-రంగారెడ్డి వాపస్ వస్తే ఏమాత్రం స్పందించలేదన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ సర్కారు ఒక్క డీపీఆర్ కూడా పంపలేదని, మూడు డీపీఆర్‌లు తిరిగి వచ్చాయని, ఒక్క క్లియరెన్స్ కూడా తేలేకపోయారని విమర్శించారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ సక్సెస్ రేటు 60ు ఉంటే.. కాంగ్రెస్ సక్సెస్ రేటు ఘోరంగా మైనస్ 30 ు ఉందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ద్రోహం వల్లే కృష్ణాలో 299 టీఎంసీలు వచ్చాయని, కానీ.. గోదావరిలో 933 టీఎంసీలకు మనం అనుమతులు సాధించామని తెలిపారు. కృష్ణా పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత తమదేనన్నారు. కల్వకుర్తిలోనే 3.5 లక్షల ఎకరాలకు నీరందించినట్లు పేర్కొన్నారు. ‘‘కృష్ణాలో 50ః50 వాటా ఇవ్వాలంటూ మా ప్రభుత్వం 28 లేఖలు రాసింది. అలాంటిది మేం మరణశాసనం రాశామని కాంగ్రెస్ అబద్ధాలాడుతున్నారు.. కేంద్రంపై పోరాటం చేసి, సుప్రీంకోర్టుకు వెళ్లి తెలంగాణ జలవాటా హక్కులను కాపాడుకున్నాం. సెక్షన్-3 సాధించిందే కేసీఆర్’’ అని హరీశ్‌రావు వివరించారు. ఐదారు నెలల్లో 500-600 టీఎంసీల నీళ్లు మనకు రాబోతున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ కూడా ఒప్పుకొంది..
2023లో 66ః34 ప్రస్తావన లేకుండానే అగ్రిమెంట్ చేశామని హరీశ్‌రావు అన్నారు. ఈ విధానానికి కాంగ్రెస్ కూడా ఒప్పుకొందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2024-25లో కృష్ణానదిలో అతి తక్కువగా కేవలం 28.49 శాతం నీటిని వినియోగించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఏడేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను 11.5 కిలోమీటర్లు తవ్వామని, దానికి రూ.1,358 కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్లలో కేవలం 18 మీటర్లు మాత్రమే తవ్విందని, అది కూడా కుప్పకూలితే.. ఇప్పటివరకు శవాలను కూడా బయటకు తీయలేకపోయిందని విమర్శించారు. శ్రీశైలంలో హక్కుల కోసం, నీటి వాటా దక్కించుకోవడం కోసమే ప్రాజెక్టు ఇన్‌టేక్‌ను జూరాల వద్ద కాకుండా శ్రీశైలానికి మార్చామని తెలిపారు. శ్రీశైలం, తుంగభద్రలో తెలంగాణ నీటి వాటాను దక్కించుకునేందుకు పాలమూరు- రంగారెడ్డి సోర్స్‌ను తోక (జూరాల) వద్ద కాకుండా తల (శ్రీశైలం) వద్దకు మార్చాల్సి వచ్చిందన్నారు. ఎక్కువ మొత్తంలో వరద జలాలను తీసుకోవచ్చని, లేదంటే తెలంగాణకు జల నష్టమని పేర్కొన్నారు. అయితే దీనిని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుబడుతూ.. ఏపీకి ప్రయోజనం కలిగే ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ఆధ్వర్యంలో మరో జల పోరాటం
కృష్ణా నదీ జలాల విషయంలో నేరం చేసేది కాంగ్రెస్ అయితే.. నెపం బీఆర్‌ఎ్‌సపై నెడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. ‘‘అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పినవి అబద్ధాలని సాక్ష్యాలతో సహా నేను బయట పెట్టినందుకు.. నన్ను అరెస్టు చేస్తారో, హత్య చేయిస్తారో, కేసుల్లో ఇరికిస్తారో’’ అని వ్యాఖ్యానించారు. అయితే తాను ఇటువంటి వాటికి భయపడేది లేదని, వాళ్లేం చేసినా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎదుర్కొంటానని ప్రకటించారు. తమకు అధికారం ముఖ్యం కాదని, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడటమే ముఖ్యమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తాము పీపీటీ ఇస్తే.. కాంగ్రెస్ బండారం బయట పడుతుందనే తమకు అవకాశం ఇవ్వలేదన్నారు. అయినా తాము ఊరుకోబోమని, కృష్ణా జలాల్లో కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాన్ని ప్రజా క్షేత్రంలో ఎండగడతామని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మరో జల పోరాటానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు.
కాళేశ్వరంపై కక్ష.. పాలమూరుపై పగ..
ఇది 60 ఏళ్ల విద్రోహమని, ఫజల్ అలీ కమిషన్ వద్దన్నా.. బలవంతంగా ఆంధ్రాలో కలిపి తెలంగాణకు ద్రోహం చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి నుంచి కాంగ్రెస్ నంబర్‌వన్ శత్రువన్నారు. నాడు పాలమూరుకు మరణశాసనం రాసింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. విభజన సమయంలో 11వ షెడ్యూల్‌లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు చేర్చలేదని నిలదీశారు. కేసీఆర్ అపర భగీరథుడిలా ప్రాజెక్టులు నిర్మిస్తే.. రేవంత్‌రెడ్డి వాటిని కుప్పకూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిపుణుల సహకారంతో పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ రూపకల్పన చేశారని, కానీ.. రెండు పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరాన్ని పండబెట్టారని ధ్వజమెత్తారు. రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్లు ఖర్చు పెడితే 5-6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉంటే.. ఈ రెండేళ్లలో 2 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు నాటి నుంచి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ద్రోహం చేశాయని, ఆ పరంపరనే రేవంత్ కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టును పండబెట్టేందుకే.. కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టును రేవంత్‌ముందుకు తెచ్చారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో 42 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో 5.71 లక్షల ఆయకట్టు, 93 వేల ఎకరాలు స్థిరీకరణకు తెస్తే.. బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో 31.51 లక్షల ఆయకట్టు స్థిరీకరణ, 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తీసుకొచ్చిందని తెలిపారు. తాము 48.74 లక్షల ఎకరాల ఆయకట్టు సాధించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1956 నుంచి 2004 వరకు మనకు వచ్చిన ఆయకట్టు 36 లక్షల ఎకరాలేనని పేర్కొన్నారు.