Harish Rao: సినీ నటులపైనా రేవంత్ సర్కార్ కక్షసాధింపు
ABN , Publish Date - Jan 12 , 2026 | 04:00 AM
మీ పేరు మర్చిపోయినందుకు మొన్న ఒక హీరోను వేధించి జైలుకు పంపారు. నిన్న.. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు మరో హీరోపై కక్షగట్టి ఆయన సినిమా రేట్ల పెంపునకు...
పరోక్షంగా నటులు అల్లు అర్జున్, ప్రభా్‌సల ప్రస్తావన
సినిమా టికెట్ రేట్ల పెంపులో కమీషన్ల దందా సాగుతోంది..
మంత్రికి తెలియకుండానే అనుమతులా?
దందాపై గవర్నర్ సమగ్ర విచారణ జరపాలి : హరీశ్‌రావు డిమాండ్
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ‘మీ పేరు మర్చిపోయినందుకు మొన్న ఒక హీరోను వేధించి జైలుకు పంపారు. నిన్న.. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు మరో హీరోపై కక్షగట్టి ఆయన సినిమా రేట్ల పెంపునకు అనుమతించలేదు. సినీ నటులపైనా రేవంత్‌రెడ్డి సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ‘పాలకుడు అనే వాడు పాలసీతో ఉండాలి తప్ప, పగతో ఉండకూడదు. ఇది ప్రజాపాలన కాదు. మీ పాపిష్టి పాలనకు పరాకాష్ట’ అని ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఆయన తీవ్రంగా విమర్శించారు. ‘మీకు నచ్చినోళ్లయితే రూ.600 టికెట్ రేటుకు అనుమతి ఇస్తారా? వారం రోజులు రేట్లు పెం చుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా?’ అని నిలదీశారు. నటులపై రేవంత్ సర్కార్ క్షక్షసాధింపు ధోరణిలో ఉందంటూ నటులు అల్లు అర్జున్, ప్రభా్‌సల పేర్ల ను పరోక్షంగా పేర్కొన్నారు. పరిశ్రమ వాతావరణా న్ని అహంకారం, పగ ప్రతీకారాలు, చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నావంటూ.. రేవంత్‌రెడ్డిపై హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఒక సినిమాకు అర్ధరాత్రి దాకా అనుమతివ్వరు.. మరో సినిమాకు రెండు రోజుల ముందే రాచమర్యాదలతో అనుమతిస్తారు. ఓ సినిమా విడుదల సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పి ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారు. ప్రజాపాలన అంటే మంత్రికి కూడా తెలియకుండా పాలన సాగడమేనా?’ అంటూ సీఎం ను ప్రశ్నించారు.
తాను ఈ సీట్లో ఉన్నంతకాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండవు, బెనిఫిట్ షోలుండవని అసెంబ్లీ వేదికగా పేర్కొన్న రేవంత్‌రెడ్డి.. రాత్రికిరాత్రే జీవోలెలా వచ్చాయో చెప్పాలన్నారు. ‘అసెంబ్లీలో అబద్ధాలాడటం మీకు వెన్నతో పెట్టిన విద్యని మాకు తెలుసు కానీ సినిమా టికెట్ల విషయంలోనూ సభను, ప్రజల ను తప్పుదోవ పట్టిస్తారా?’అని హరీశ్‌రావు నిలదీశారు. ‘సినిమా రంగాన్ని మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా?’అని ప్ర శ్నించారు. రాష్ట్రంలో ఇప్పుడు థియేటర్లలోకన్నా సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని, సినిమా రేట్ల పెంపులో కమీషన్ల దందా కొనసాగుతోందని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వం ఎవరి కంట్రోల్‌లో ఉందనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోందన్నారు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? త్వరలోనే బయటపెడతామన్నారు. ఒక్కో సినిమాకు కమీషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారనేది త్వరలోనే బహిర్గతం చేస్తామన్నారు. ఆ శాఖ మం త్రికి తెలియకుండా జరుగుతున్న సినిమా రేట్లకు సంబంధించిన కమీషన్ల దందాపై గవర్నర్ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టికెట్ ధరల పెంపుపై జీవో వస్తే.. సినిమాటోగ్రఫీ మంత్రి తనకు తెలియదంటున్నారని పేర్కొన్నారు. టికెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని మంత్రి కోమటిరెడ్డి చెప్పకనే చెబుతున్నారని, ఆయనకు తెలియకుం డానే జీవోలు విడుదలవుతున్నాయంటే.. తెరవెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉందని ప్రశ్నించారు.