రేవంత్ తుగ్లక్ నిర్ణయాలతో సింగరేణి అథోగతి
ABN , Publish Date - Oct 09 , 2026 | 06:22 AM
గత ప్రభుత్వ హయాంలో లాభాల బాటలో ఉన్న సింగరేణి సంస్థ.. రేవంత్‌రెడ్డి తుగ్లక్ నిర్ణయాలతో అథోగతి పాలవుతోందని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు
బంధుప్రీతి వల్ల 12 మిలియన్ టన్నుల మేర తగ్గిన ఉత్పత్తి
కార్మిక సమస్యలపై బీఆర్‌ఎస్ ప్రత్యక్ష పోరాటం
14న సింగరేణి కార్మిక గర్జన బహిరంగ సభ: హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో లాభాల బాటలో ఉన్న సింగరేణి సంస్థ.. రేవంత్‌రెడ్డి తుగ్లక్ నిర్ణయాలతో అథోగతి పాలవుతోందని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. సింగరేణిని ప్రైౖవేటీకరించే కుట్రలను, కార్మికులకు నష్టం కలిగించే చర్యలను బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని ప్రత్యక్ష పోరాటం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆగిపోయిన రూ.50 వేల కోట్ల నిధులను వెంటనే సింగరేణికి చెల్లించాలని, ఎన్నికలు నిర్వహించాలని, కార్మిక సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఈనెల 14న సింగరేణి కార్మిక గర్జన పేరిట రామగుండంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. రెండున్నరేళ్లుగా ప్రభుత్వ అవినీతి, బంధుప్రీతి, పరిపాలన వైఫల్యంతో సంస్థ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. 2023-24లో 70 మిలియన్ టన్నుల నుంచి 2025-26కు 58 మిలియన్ టన్నులకు బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయిందని చెప్పారు. ఆనవాయితీ ప్రకారం... దసరా వస్తున్నా కూడా సింగరేణి సంస్థ లాభాలు, అందులో కార్మికుల వాటాను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదని విమర్శించారు.