సోలార్ స్కామ్‌ల కాంగ్రెస్
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:21 AM
సింగరేణి సంస్థలో సౌరవిద్యుత్ టెండర్లలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. వందల కోట్లు చేతులు మారాయన్నారు.
టెండర్లలో కుంభకోణం.. తమవారి కోసం 3 ప్లాంట్లను కలిపి ఒకే టెండర్
రూ.500 కోట్లు చేతులు మారాయి: మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపణ
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థలో సౌరవిద్యుత్ టెండర్లలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. వందల కోట్లు చేతులు మారాయన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మూడు వేరువేరు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టాల్సి ఉంటే.. తమవారికే కట్టబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అన్నింటినీ కలిపి 107 మెగా వాట్లతో ఒకే టెండర్‌గా పిలిచారని ఆరోపించారు. ఈ టెండర్‌ను గిల్టీ పవర్ లిమిటెడ్ అనే కంపెనీకి కట్టబెట్టారన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే షరతు పెట్టి టెండర్ల ప్రక్రియలో ఎంఎ్‌సఎంఈలు, పారిశ్రామికవేత్తలు పాల్గొనకుండా చేశారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రస్తుత విధానంలో ఒక మెగావాట్ సోలార్ ఉత్పత్తికి రూ.3.50 కోట్లు అవుతుందని, దీనికితోడు భూమి కూడా కంపెనీలదే ఉం టుందని హరీశ్ వివరించారు. అదే తెలంగాణలో సింగరేణి భూమిలో ప్లాంటు పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేసినందుకు ఒక మెగావాటుకు రూ.5.04 కోట్లను కాంట్రాక్టరుకు చెల్లిస్తున్నారని చెప్పారు. ఇలా రూ.540 కోట్ల కాంట్రాక్ట్‌ను కావాల్సినవారికి కట్టబెట్టారన్నారు. మరో స్కాం రామగుండం కేంద్రంగా జరిగిందని, దీనివల్ల సింగరేణి సంస్థ దాదాపు రూ.200 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. ఒక మెగావాట్‌కు జాతీయ స్థాయిలో చెల్లించేదానికంటే రెండింతలు పెంచి రూ.7 కోట్లు చెల్లిస్తున్నారని చెప్పారు. 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను తమకు అనుకూలమైన కంపెనీకి రూ.480 కోట్లకు కట్టబెట్టారని హరీశ్ ఆరోపించారు. ఈ టెండర్లకు సంబంధించి రూ.500 కోట్లు, చేతులు మారాయని ఆరోపించారు. శ్రీరాంపూర్‌లో ఓబీ 600 కోట్ల వర్క్ టెండర్ పిలిచి, టెక్నికల్ బిడ్ ఓపెన్‌చేసినా.. సృజన్‌రెడ్డి చెప్పారని ఫైనాన్షియల్ బిడ్ ప్రక్రియను ఏడుసార్లు వాయిదా వేశారని ఆరోపించారు. సీఎం బావమరిదికి సెటిల్‌మెంట్లు కుదరకనే ఇలా చేశారన్నారు. ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో కిషన్‌రెడ్డి విచారణ జరిపించాలని హరీశ్ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డికి నిజాయితీ ఉంటే ఆయన బావమరిది సృజన్‌రెడ్డిపై సిట్ వేయాలని, సింగరేణి కుంభకోణంపై సిటింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
అక్రమాలకు ఒప్పుకోని అధికారికి రివర్షన్
సింగరేణిలో పేలుళ్లకోసం జిలెటిన్ స్టిక్స్ వాడతారని, వాటి కొనుగోళ్లలో 30శాతం రేటు అదనంగా పెట్టి కొనాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారని హరీశ్ ఆరోపించారు. దీనికి నిరాకరించిన జీవీరెడ్డి అనే డైరెక్టర్‌ను ఇబ్బందిపెడితే ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారన్నారు. తర్వాత మరో డైరెక్టర్ వికే శ్రీనివాస్ కూడా సంతకం పెట్టనంటే ఆయన్ను డైరెక్టర్‌నుంచి జీఎం పదవికి రివర్షన్ చేశారని చెప్పారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి రూ.1044 కోట్లతో ప్రకాశం గని టెండర్లు పిలిచారని, ఆ టెండర్ ప్రక్రియను కూడా తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గు కుంభకోణం యూపీఏ ప్రభుత్వ పతనానికి దారితీసినట్లే ఈ కుంభకోణం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పతనానికి బీజం పడిందన్నారు.
చట్టాన్ని అతిక్రమిస్తున్న అధికారులు, పోలీసులను వదిలిపెట్టం
రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమేనని, చట్టాన్ని అతిక్రమించి, రాజకీయ కక్ష సాధింపులకు సహకరించే అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తే లేదని హరీశ్ హెచ్చరించారు. అధికార పార్టీకి తలొగ్గి తప్పుడు చర్యలకు పాల్పడినవారు రిటైర్ అయినా, ఎక్కడ దాక్కున్నా పట్టుకొచ్చి విచారిస్తాని హెచ్చరించారు. వరుసగా మీడియాకు లీకులు ఇస్తున్నారని, మీడియా సంస్థలు కూడా వాటిని ప్రసారం చేస్తున్నాయని, ఆ లీకులకు ఆధారాలు ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.