Share News

అధికారులకు రేవంత్‌ బెదిరింపులు

ABN , Publish Date - Mar 05 , 2026 | 02:11 AM

రాష్ట్రంలోని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై రేవంత్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులోనూ సీఎం బెదిరింపు ధోరణిలో మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

అధికారులకు రేవంత్‌ బెదిరింపులు

  • మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై రేవంత్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులోనూ సీఎం బెదిరింపు ధోరణిలో మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తమ అక్రమాలకు సహకరించని అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని విమర్శించారు. వరుస బదిలీల వల్ల రాష్ట్రంలో పరిపాలన కుంటుబడుతోందని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘గత రెండున్నరేళ్లలో ఉన్నతాఽధికారులను ఐదుసార్లు అధిక సంఖ్యలో బదిలీ చేశారు. విభాగాధిపతులు కనీసం 8 నెలలు కూడా ఒకే చోట పని చేయడం లేదు. విద్యుత్‌ శాఖలో రెండేళ్లలో ఐదుగురు, ఆరోగ్యశ్రీలో ఎనిమిది మంది అధికారులు మారారు. సింగరేణి, జీహెచ్‌ఎంసీ, మైనింగ్‌, ఐటీ వంటి కీలక శాఖల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. యువ కలెక్టర్లను పదేపదే మార్చడం వల్ల వారి పని తీరుపై ప్రభావం పడుతోంది. జిల్లాలపై అవగాహన రాకముందే వారిని బదిలీ చేస్తున్నారు. ఇక సీఎస్‌ వంటి కీలక బాధ్యతల్లో ఉన్న వారికి అదనంగా ఐటీ కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం వల్ల పనితీరు మందగిస్తోంది’’ అని వివరించారు. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం పారదర్శకతను గాలికొదిలేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. నియోపోలి్‌సలో సీఎం బంధువులకు అక్రమ మైనింగ్‌ కట్టబెట్టారని, నిబంధనలకు విరుద్ధ్దంగా మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి సంస్థ రాజేంద్రనగర్‌లో మైనింగ్‌ చేస్తోందని ఆరోపించారు. దీనిపై నిజనిర్ధారణకు బీఆర్‌ఎస్‌ బృందం గురువారం అక్కడకు వెళ్లనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. 80 శాతం జీవోలను ఆఫ్‌లైన్‌లో ఉంచుతున్నారని, కోర్టు ఆదేశించినా ఆన్‌లైన్‌ చేయడం లేదని ధ్వజమెత్తారు. యంగ్‌ ఇండియా స్కూళ్ల నిర్మాణ టెండర్లలో ఐదు శాతం అదనంగా కట్టబెడుతున్నారని, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయట పెడతానని హెచ్చరించారు. మరోవైపు అసెంబ్లీ వ్యవస్థను కాంగ్రెస్‌ అపహాస్యం చేస్తోందని, డిప్యూటీ స్పీకర్‌, చీఫ్‌ విప్‌ వంటి పదవులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

Updated Date - Mar 05 , 2026 | 02:11 AM