‘కాళేశ్వరం’ వెనక ఎంతో శ్రమ
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:25 AM
తెలంగాణ కలల ప్రాజెక్టు కాళేశ్వరం రూపుదిద్దుకోవడం వెనుక కఠినమైన శ్రమ, అంతర్రాష్ట్ర వివాదాలు లేకుండా చూసుకోవాలన్న మంచి ఉద్దేశం ఉన్నాయని నీటిపారుదలశాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టుకు విన్నవించారు.
అంతర్రాష్ట్ర వివాదాలు లేకుండా కట్టాం
ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయండి
హైకోర్టుకు హరీశ్ వినతి..నేడు కేసీఆర్ తరఫు వాదనలు
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కలల ప్రాజెక్టు కాళేశ్వరం రూపుదిద్దుకోవడం వెనుక కఠినమైన శ్రమ, అంతర్రాష్ట్ర వివాదాలు లేకుండా చూసుకోవాలన్న మంచి ఉద్దేశం ఉన్నాయని నీటిపారుదలశాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టుకు విన్నవించారు. మహారాష్ట్రతో వివాదాలు, న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేలా ఈ ప్రాజెక్టు డిజైనింగ్ జరిగిందని తెలిపారు. అందువల్ల ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టేయాలని కోరారు. ఘోష్ రిపోర్ట్‌ను కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ హైకోర్టులో వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. హరీశ్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు ప్రారంభించారు. 2005లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిపాదించిందని, అది ఆచరణ సాధ్యం కాదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఎంతో శ్రమకు ఓర్చి పూర్తిస్థాయి చర్చల తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనలతో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత అనతి కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని చెప్పారు. గోదావరి నది వెంట మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారని వివరించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ హరీశ్‌ను సాక్షిగా మాత్రమే పిలిచిందని, సాక్షిగా పిలిచి అవినీతి ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి ఇంజినీరింగ్ లోపాలు లేవని కేవలం రాజకీయ దురుద్దేశంతో కమిషన్ వేశారని ఆరోపించారు. అనంతరం కేసీఆర్ తరఫున మరో సీనియర్ న్యాయవాది దామ శేషాద్రి నాయుడు వాదనలు మొదలు పెట్టారు. కోర్టు సమయం ముగిసిపోవడంతో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.