రాష్ట్రాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టారు: హరీశ్
ABN , Publish Date - Mar 17 , 2026 | 03:59 AM
బాధ్యత లేని, చేతకాని సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని బీఆర్‌ఎస్ శాసన సభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు...
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : బాధ్యత లేని, చేతకాని సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని బీఆర్‌ఎస్ శాసన సభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. ఆయన నిర్లక్ష్య వైఖరి వల్ల కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. అసెంబ్లీ మీడియా హాల్ లో సోమవారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటిదాకా కృష్ణాలో నీటి దోపిడీకి పాల్పడ్డ ఏపీ.. ఇప్పుడు గోదావరి జలాలపై పడిందని విమర్శించారు. కొత్తగా 775 టీఎంసీలు కావాలని కొట్లాడుతోందని తెలిపారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అక్కడి గవర్నర్ ప్రసంగిస్తూ.. నల్లమల్ల సాగర్‌నుంచి నీళ్లు తీసుకువెళ్లడానికి పనులు ముమ్మరం చేస్తున్నామని గర్వంగా చెప్పారన్నారు. గవర్నర్ ప్రసంగం అంతా డొల్ల అని, చిత్తు కాగితంతో సమానమని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశించారు.