Share News

kumaram bheem asifabad-తీరనున్న కష్టాలు

ABN , Publish Date - Jun 28 , 2026 | 10:18 PM

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులను కేటాయించింది. వివిధ పథకాల నుంచి రూ.13 కోట్ల మేర విడుదలయ్యాయి. ఈ నిధులతో అంతర్గతరోడ్లు, సీసీ రోడ్లు, కూడళ్ల అభివృద్ధి, వంతెనలు నిర్మించనున్నారు. నిధులు విడుదల కావడంతో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుండటంతో ఆయా వార్డుల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

kumaram bheem asifabad-తీరనున్న కష్టాలు
కల్వర్టు పనులకు పూజ చేస్తున్న ఎమ్మెల్సీ దండే విఠల్‌(ఫైల్‌)

- రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి అధికారుల ప్రణాళికలు

కాగజ్‌నగర్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులను కేటాయించింది. వివిధ పథకాల నుంచి రూ.13 కోట్ల మేర విడుదలయ్యాయి. ఈ నిధులతో అంతర్గతరోడ్లు, సీసీ రోడ్లు, కూడళ్ల అభివృద్ధి, వంతెనలు నిర్మించనున్నారు. నిధులు విడుదల కావడంతో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుండటంతో ఆయా వార్డుల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగజ్‌నగర్‌లో 30 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో అంతర్గత సీసీ రోడ్లకు రూ.3.17 కోట్లు, రాజీవ్‌ గాంధీ చౌరస్తా నుంచి సంజీవయ్య కాలనీ వరకు సీసీ రోడ్డుకు రూ.3.14 కోట్లు, కాపువాడలో వాటర్‌ డ్రైన్‌ నిర్మాణం కోసం రూ.1.35 కోట్లు, తెలంగాణ తల్లి, రాజీవ్‌ గాంధీ, విజయ బస్తీ, శివాజీ చౌరస్తా అభివృద్ధి, వాణిజ్య సముదాయాల నిర్మాణం కోసం రూ.2.27 కోట్లు, బాలాజీనగర్‌ తదితరకాలనీల్లో సీసీ రోడ్లకు రూ.2.78 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం నుంచి రాజీవ్‌ గాంధీ చౌరస్తా, రాజీవ్‌ గాంధీ చౌరస్తా నుంచి రైల్వేగేటు వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు.

- రోడ్డుకు ఇరువైపులా..

ఇందుకు గాను ప్రస్తుతం రోడ్డుకు ఇరువైపులా ఎంత మేర తొలగించాలన్నది మున్సిపల్‌ అధికారుల మార్కింగ్‌ ఇచ్చారు. అయితే ఈ మార్గంలోనే ఎస్పీఎం కార్మికుల నివాస క్వార్టర్లు కూడా ఉండడంతో తొలగింపు ప్రక్రియ అడ్డంకిగా మారింది. మార్కెట్‌ ఏరియాలో ప్రధాన కూడలి అయిన రాజీవ్‌ గాంధీ చౌరస్తా విస్తరణ ప్రక్రియను ప్రారంభించి ఇప్పటికి రెండు నెలలు దాటింది. కానీ తమ దుకాణాలను తొలగించరాదని, తామే తొలగించకుంటామని కొంత మంది అభ్యర్థన మేరకు కొంత సమయం ఇచ్చారు. అయితే పనులు జాప్యం జరుగుతుండడం, పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య అధికమవుతుండడంతో ఈ పనులు త్వరితగతిన చేపట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అంతా డిమాండు చేస్తున్నారు. కాగజ్‌నగర్‌ మెహరాజ్‌ మసీదు సమీపంలో గతేడాది చిన్న కల్వర్టుపై లోడ్‌ లారీ వెళ్లడంతో పూర్తిగా కూలి పోయింది. ఈ మార్గంలో పాఠశాల ఉండడంతో నిత్యం విద్యార్థులు రాకపోకలు సాగించేందుకు రహదారి లేకుండా ఏర్పడింది. ఇక్కడ కల్వర్టు నిర్మించాలని మున్సిపల్‌ అధికారులకు లిఖిత పూర్వకంగా వినతి పత్రాలు అందజేశారు. గతంలోనే వార్డు పర్యటన సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్‌ వచ్చి పరిశీలించారు. ఎన్నికలు కాగానే తప్పకుండా కల్వర్టు నిర్మాణం చేపడుతామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధులు విడుదల కావటంతో రూ.8లక్షలు ఇక్కడే కల్పించి పనులకు శంకుస్థాపన చేపట్టారు. ఏడాది నుంచి పడుతున్న ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోనున్నాయని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వివిధ వార్డుల్లో కూడా అత్యవసర పనులు ప్రారంభిస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ఆరంభంలోనే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతిని వివరణ కోరగా అత్యవసరమున్న సమస్యలను పరిష్కరించేందుకు అభివృద్ధి పనులు ప్రారంభిసున్నామని చెప్పారు. అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.

Updated Date - Jun 28 , 2026 | 10:18 PM