Share News

అంతులేని అక్రమాల్లో సబ్‌ రిజిస్ట్రార్లు

ABN , Publish Date - Apr 04 , 2026 | 05:40 AM

హనుమకొండలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు కలకలం రేపుతున్నాయి.

అంతులేని అక్రమాల్లో సబ్‌ రిజిస్ట్రార్లు

  • హన్మకొండ సబ్‌ రిజిస్ట్రార్లు ఆనంద్‌, రాంనర్సింహారావు ఇళ్లల్లో ఏసీబీ సోదాలు

  • డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రూ.42 లక్షలు జమ అయినట్లు గుర్తింపు

హనుమకొండ టౌన్‌/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): హనుమకొండలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు కలకలం రేపుతున్నాయి. రెండోరోజు శుక్రవారం హనుమకొండ, ఖమ్మంలో సబ్‌ రిజిస్ట్రార్ల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సోదాల్లో అనేక అవకతవకలు గుర్తించామని, డాక్యుమెంట్‌ రైటర్లతో కలిసి సబ్‌ రిజిస్ట్రార్లు అక్రమాలకు పాల్పడ్డట్లు ఆధారాలు సేకరించామని, భారీగా నగదు సైతం పట్టుబడిందని ఏసీబీ డీజీ చారుసిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకతవకలకు సంబంధించి ప్రభుత్వానికి తదుపరి చర్యల నిమిత్తం నివేదిక పంపిస్తున్నామని చారుసిన్హా తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండలోని సబ్‌ రిజిస్ట్రార్లు ఆనంద్‌, రాంనర్సింహరావు క్యాబిన్‌లలో రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. శుక్రవారం ఉదయం 7గంటల వరకు సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. కార్యాలయంలో అనధికార ఏజెంట్లతో లావాదేవీలు జరిపినట్లు పేర్కొన్నారు. 20 మంది ఏజెంట్ల నుంచి ఏడాదికాలంలో లెక్కకు చూపని రూ.42లక్షలకు పైగా ఫోన్‌పే ద్వారా లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారు డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్లు 204 రిజిస్ట్రర్‌ పత్రాలను తమదగ్గరే పెట్టుకున్నారని వెల్లడించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆనంద్‌కు చెందిన హనుమకొండ, ఖమ్మంలోని ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.24.61 లక్షల నగదు, సుమారు రూ.1.20 కోట్ల విలువైన 820 గ్రాముల బంగారం, 2.600కిలోల వెండి ఆభరణాలు, కపిల్‌ చిట్స్‌లో రూ.30.10లక్షల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పత్రాలు స్వాధీనం చేసుకొని ఆస్తులపై విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Apr 04 , 2026 | 08:04 AM