రాష్ట్రంలోనూ చేతుల మార్పిడి ఆపరేషన్లు
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:25 AM
నేత్రదానం, అవయవ దానాల్లో భాగంగా గుండె, కాలేయ, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చూశాం! త్వరలో అన్నీ కుదిరితే చేతుల మార్పిడి శస్త్రచికిత్సలు..
దృష్టిపెట్టిన జీవన్‌దాన్.. ముందుకొచ్చిన నిమ్స్, ఉస్మానియా, మరో రెండు ఆస్పత్రులు
ఆస్పత్రుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ.. నిమ్స్ నుంచి శ్రీకారం.. ఆపై మిగతా చోట్ల
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): నేత్రదానం, అవయవ దానాల్లో భాగంగా గుండె, కాలేయ, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చూశాం! త్వరలో అన్నీ కుదిరితే చేతుల మార్పిడి శస్త్రచికిత్సలు.. అంటే హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్లూ సాధ్యపడొచ్చు. ప్రమాదాల్లో చేతులు తెగిపోయి.. పనులు చేసుకోకుండా ఇంటికే పరిమితమయ్యామని కుమిలిపోతున్న వారిలో కొత్త ఆశలు చిగురించేలా ఉన్న ఈ విధానానికి రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దిశగా ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (సోట్టో-తెలంగాణ-జీవన్ దాన్) అడుగులు వేస్తోంది. చేతుల మార్పిడి కోసం జీవన్‌దాన్‌కు ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, నిమ్స్‌తో పాటు కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు సుముఖత వ్యక్తం చేశాయి. ఆ ఆస్పత్రుల్లో సదుపాయాలు, వైద్య సిబ్బంది పరిస్థితులను పరిశీలించి.. అన్ని సవ్యంగా ఉన్నాయని నిర్ధారణకు వచ్చాకే మార్పిడికి అనుమతినివ్వాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. తమిళనాడు, కేరళలో చేతులు మార్పిడి ప్రక్రియను అమలు చేస్తున్నారు. చేతుల మార్పిడి చేయించుకోవడానికి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి ఇప్పటికే పది మందికిపైగా బాధితులు ఆశ్రయించారని వైద్యులు చెబుతున్నారు. కాగా ఈ ప్రక్రియను తొలుత నిమ్స్‌లో మొదలు పెట్టాలని వైద్యాధికారులు అనుకుంటున్నారు. గ్రహీతల ఆరోగ్య పరిస్థితులు, కొత్త చేతుల పనితీరు.. అన్ని పరిశీలించి, సవ్యంగా ఉంటే ఉస్మానియా, ఆ తర్వాత కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రక్రియను మొదలు పెట్టాలని భావిస్తున్నారు.
రహదారి, పరిశ్రమలు, వ్యవసాయ యంత్రాలు, విద్యుత్తు ప్రమాదాల్లో కార్మికులు, రైతులు చేతులు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వారికి ఈ చేతి మార్పిడి కొత్త జీవితాన్ని కల్పించనుందని వైద్యులు చెబుతున్నారు. చేతులు మార్పిడి, పునర్నిర్మాణ ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీనికి నిపుణులతో కూడిన వైద్య విభాగాల బృందం అవసరమని.. ఎముకలు, కండరాలు, నరాలు, రక్తనాళాలు బాధితుల చేతులతో అనుసంధానం చేయాల్సి ఉంటుందని వివరించారు.
వైద్య బృందంతో ప్రత్యేక కమిటీ
చేతుల మార్పిడికి అనుమతినివ్వడానికి తొలుత 10-15 మంది వైద్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ చేతుల మార్పిడికి ముందుకొచ్చిన ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రులను సందర్శించి మాకు నివేదిక ఇస్తుంది. ప్రభుత్వం అనుమతిస్తే ప్రక్రియ మొదలుపెడతాం.
- డాక్టర్ శ్రీ భూషణ్‌రాజు, జీవన్‌దాన్ సమన్వయకర్త