Share News

హనుమకొండలో గుడిసెల తొలగింపు ఉద్రిక్తం

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:53 AM

హనుమకొండ శివారులోని గుండ్లసింగారం, సురవరం సుధాకర్‌రెడ్డి కాలనీలో గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

హనుమకొండలో గుడిసెల తొలగింపు ఉద్రిక్తం

  • తెల్లవారుజామున 360 గుడిసెలను నేలమట్టం చేసిన వైనం

వరంగల్‌ కార్పొరేషన్‌, నయీంనగర్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): హనుమకొండ శివారులోని గుండ్లసింగారం, సురవరం సుధాకర్‌రెడ్డి కాలనీలో గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గుండ్లసింగారం గ్రామంలోని కోమలకుంట సర్వే నెంబర్‌ 174లో సీపీఐ ఆధ్వర్యంలో కొందరు పేదలు గుడిసెలు వేసుకొని ఐదేళ్లుగా నివసిస్తున్నారు. అక్కడి 360 గుడిసెలను శనివారం తెల్లవారుజామున 5 గంటలప్పుడు రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసు సిబ్బంది నేలమట్టం చేశారు. సుమారు 200 మంది పోలీసులు, ఆరు డోజర్లు, 12 ట్రాక్టర్లు, డీఆర్‌ఎఫ్‌ వాహనాలతో వచ్చిన రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బంది.. గుడిసెలను కూల్చేశారు. కూల్చివేతల సమయంలో కొంతమంది ఇళ్లలోనే ఉన్నారు. దాంతో చాలా మందికి గాయాలయ్యాయి. ఇళ్లలోని నిత్యావసర వస్తువులు, ముఖ్యమైన పత్రాలు వంటివి తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదు. ఇక, విషయం తెలుసుకున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఘటనాస్థలాన్ని సందర్శించారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

Updated Date - Jun 21 , 2026 | 04:53 AM