Share News

హ్యామ్‌ రోడ్ల టెండర్ల వ్యవహారం కొలిక్కి!

ABN , Publish Date - May 19 , 2026 | 05:42 AM

రోడ్లు, భవనాల శాఖలో హైబ్రిడ్‌ యాన్యువిటీ మోడల్‌(హ్యామ్‌) విధానంలో చేపట్టాలని నిర్ణయించిన రోడ్ల పనుల టెండర్ల వ్యవహారం కొలిక్కి వచ్చింది.

హ్యామ్‌ రోడ్ల టెండర్ల వ్యవహారం కొలిక్కి!

  • అధిక ధరలను కోట్‌ చేయడంపై కాంట్రాక్టర్లతో ఆర్‌ అండ్‌ బీ అధికారుల విస్తృత చర్చలు

  • ఎస్టిమేట్స్‌లో మార్పులు చేయాలని నిర్ణయం

  • మార్పులతో నేడు సీఎం రేవంత్‌ వద్దకు ఫైలు

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): రోడ్లు, భవనాల శాఖలో హైబ్రిడ్‌ యాన్యువిటీ మోడల్‌(హ్యామ్‌) విధానంలో చేపట్టాలని నిర్ణయించిన రోడ్ల పనుల టెండర్ల వ్యవహారం కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలో 6,092కిలోమీటర్ల రోడ్లను రూ.13,006కోట్లతో హ్యామ్‌ విధానంలో చేపట్టేందుకు ఆర్‌ అండ్‌ బీ అధికారులు టెండర్లను ఆహ్వానించారు. అయితే కాంట్రాక్టర్లు ఆ అంచనాల కన్నా 14.5శాతం-23.5శాతం వరకు అధిక ధరలను(ఎక్సెస్‌) కోట్‌ చేశారు. దీంతో, ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్లతో ఆర్‌ అండ్‌ బీ అధికారులు వరుస భేటీలు నిర్వహించారు. అధిక ధరలను ఎందుకు కోట్‌ చేయాల్సి వచ్చింది, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటనేదానిపై లోతుగా చర్చించారు. హ్యామ్‌ రోడ్ల కోసం ఆహ్వానించిన టెండర్లలో అత్యంత కీలకమైన అంశాలు ఎస్టిమేట్స్‌లో చేర్చలేదని కాంట్రాక్టర్లు అధికారులకు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే మొబిలిటీ అడ్వాన్స్‌తో పాటు బ్యాంకుల నుంచి కాంట్రాక్టర్లు తీసుకునే రుణానికి చెల్లించే జీఎస్టీ అంశం ఇందులో ప్రధానంగా ఉంది. మొబిలిటీ అడ్వాన్స్‌, బ్యాంకుల నుంచి తీసుకునే రుణానికి దాదాపు 9.30శాతం మేర జీఎస్టీ కింద చెల్లించాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు తెలిపారు. దీంతో, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆర్‌ అండ్‌ బీ శాఖ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. అలాగే పెట్రోలింగ్‌, అంబులెన్స్‌ల నిర్వహణకు అయ్యే ఖర్చును ఎస్టిమేట్స్‌లోనే పెట్టలేదు. అందుకే వీటికి అయ్యే 4శాతం ఖర్చును పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు. వెరసి ఇప్పటివరకు హ్యామ్‌లో నెలకొన్న టెండర్ల ‘ఎక్సెస్‌’ అనిశ్చితికి అధికారులు తెరదించారు. కాంట్రాక్టర్లతో జరిగిన చర్చలు, పరిష్కార మార్గాలపై అధికారులు ఒక నివేదికను రూపొందించి మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి నివేదించనున్నట్టు తెలిసింది. హ్యామ్‌ రోడ్లకు సంబంధించిన ఎస్టిమేట్స్‌లో పలు కీలక మార్పులు చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో మే 21న నిర్వహించే క్యాబినెట్‌ సమావేశంలో సంబంధిత ఫైలును పెట్టనున్నారు. అక్కడ ఆమోదం పొందిన తరువాత ఇప్పుడున్న టెండర్లలోనే పలు మార్పులు చేసి, పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.

Updated Date - May 19 , 2026 | 05:42 AM