ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా హ్యామ్ రోడ్లు
ABN , Publish Date - May 12 , 2026 | 04:10 AM
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పరిశ్రమల విస్తరణకు దోహదపడేలా రహదారి మౌలిక వసతులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు...
హ్యామ్ టెండర్లపై సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పరిశ్రమల విస్తరణకు దోహదపడేలా రహదారి మౌలిక వసతులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్) విధానంలో నిర్మించ తలపెట్టిన రోడ్ల టెండర్లపై సచివాలయంలో సోమవారం అఽధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యుద్ధం నేపథ్యంలో హ్యామ్ రోడ్ల నిర్మాణంలో వినియోగించే సామగ్రి ధరలు అమాంతం పెరిగాయని, దాంతో హ్యామ్ ప్రాజెక్టుపై సుమారు 20-25శాతం వరకు ప్రభావం పడుతోందని అధికారులు మంత్రికి వివరించారు. కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన హ్యామ్ విధానాన్ని ఎన్‌హెచ్‌ఏఐ 2016 నుంచి దేశవ్యాప్తంగా అమలుచేస్తోందని, ఇప్పటివరకు 374 ప్రాజెక్టులను దాదాపు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులతో చేపట్టినట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో ఈ విధానాన్ని మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, బిహార్ అమలుచేస్తున్నాయని, అదే తరహాలో తెలంగాణ కూడా హ్యామ్‌ను రూపొందించిందని చెప్పారు. కాగా హ్యామ్ టెండర్ల అంశంపై మంగళ, బుధవారాల్లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి మాట్లాడుతానని తెలిపారు.