Share News

హ్యామ్‌ రోడ్ల విధివిధానాల్లో మార్పులు!

ABN , Publish Date - May 15 , 2026 | 04:29 AM

రాష్ట్రంలో హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో చేపట్టబోయే రోడ్ల పనుల వ్యవహారం కొలిక్కి రావడంలేదు. 34 ప్యాకేజీల్లో 6,092 కిలోమీటర్ల రోడ్లను రూ.13,006కోట్లతో హ్యామ్‌ విధానంలో..

హ్యామ్‌ రోడ్ల విధివిధానాల్లో మార్పులు!

  • అంబులెన్స్‌లు, పెట్రోలింగ్‌ వాహనాల రద్దుకు నిర్ణయం

  • ఖర్చు తగ్గించి.. కాంట్రాక్టర్లపై భారం తగ్గించేలా ప్రణాళిక

  • కాంట్రాక్టర్లతో ఆర్‌ అండ్‌ బీ అధికారుల సమాలోచనలు

  • ‘ఎక్సెస్‌’ వ్యవహారానికి తెరదించే దిశగా ముమ్మర కసరత్తు

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో చేపట్టబోయే రోడ్ల పనుల వ్యవహారం కొలిక్కి రావడంలేదు. 34 ప్యాకేజీల్లో 6,092 కిలోమీటర్ల రోడ్లను రూ.13,006కోట్లతో హ్యామ్‌ విధానంలో నిర్మించాలని నిర్ణయించి, టెండర్లను ఆహ్వానించగా.. కాంట్రాక్టర్లు అధిక ధరలు కోట్‌ చేశారు. అది కూడా ఏకంగా 23.5శాతంగా ఉంది. ఇది రాజకీయ మలుపు తిరగడంతో.. ఎక్సెస్‌ టెండర్ల వ్యవహారంపై ఆర్‌ అండ్‌ బీ అధికారులు పునరాలోచనలో పడ్డారు. మరోవైపు, ఎక్సెస్‌ లేకపోతే హ్యామ్‌ పనులు చేయలేమని, అవసరమైతే పనుల నుంచి తప్పుకునేందుకు విత్‌డ్రా లెటర్లు ఇస్తామని కాంట్రాక్టర్లు తేల్చి చెబుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో హ్యామ్‌ రోడ్ల పనులను పట్టాలెక్కించేందుకు ఉన్న మార్గాలను అన్వేషించేందుకు గురువారం కొంతమంది కాంట్రాక్టర్లతో సమావేశమైన అధికారులు.. శుక్ర, శనివారాల్లోనూ మరి కొంతమంది కాంట్రాక్టర్లతో సమావేశం కానున్నారు. హ్యామ్‌ టెండర్లలో వచ్చిన ఎక్సెస్‌ రేట్లను పనుల ప్రతిపాదన రేటు కార్డులోనే మార్చాలని, తద్వారా కొంత మేర ధరలు పెరిగినా కాంట్రాక్టర్‌పై భారం పడబోదనే చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న హ్యామ్‌ రోడ్ల పనుల ధరల ప్రకారం చూస్తే.. కాంట్రాక్టర్లు బ్యాంకుల నుంచి తీసుకునే 60శాతం రుణానికి జీఎస్టీ, వడ్డీ చెల్లింపులు కలిపి 9.30శాతం అదనంగా వెచ్చించాల్సి ఉంది. అలాగే, పెట్రోలింగ్‌ వాహనాలు (2), అంబులెన్స్‌లు (2) నిర్వహణకు దాదాపు 4శాతం అదనంగా ఖర్చవుతోంది. స్వతంత్ర ఇంజినీర్‌ చార్జీలు 1 శాతం, ఇతరత్రా ఖర్చులు కలిపి అధికారికంగానే 15శాతం ఎక్సెస్‌ వస్తున్నట్టు ఇటీవల ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు. ఇది ప్రభుత్వానికి భారంగా మారనున్న నేపథ్యంలో అంబులెన్స్‌, పెట్రోలింగ్‌ వాహనాల నిర్వహణను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో కాంట్రాక్టర్లపై 4శాతం భారం తగ్గనుంది. ఇది పోగా బ్యాంకర్లకు కాంట్రాక్టర్లు చెల్లించే 9.30శాతం వడ్డీ ఎక్సెస్‌ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాగే, మరికొన్ని ఖర్చులపై ప్రతిపాదనల్లో కీలకంగా మార్పులు చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలను మార్చాక మరోసారి టెండర్లను పిలవాలా? లేదంటే ప్రస్తుత టెండర్లనే కొనసాగించాలా? అనే దానిపైనా ఒక నిర్ణయం తీసుకోనున్నారు. మార్పులు చేసిన తరువాత కేవలం 5శాతం లోపు ఎక్సెస్‌ ధరలకే అవకాశం ఇవ్వనున్నట్టు తెలిసింది. మొత్తంగా హ్యామ్‌ టెండర్లలో చోటుచేసుకున్న ‘ఎక్సెస్‌’ వ్యవహారానికి తెరదించే దిశగా అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.

Updated Date - May 15 , 2026 | 04:29 AM