Gutha Sukender Reddy: తెలంగాణలో కొత్త పార్టీలకు చోటు లేదు!
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:57 AM
రాష్ట్రంలో ఇప్పుడున్న పార్టీలే చాలని.. కొత్తగా పార్టీలు పెట్టేందుకు స్పేస్ లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
పార్టీలు నడపడం అంత తేలికేమీ కాదు..
గతంలో చిరంజీవి, దేవేందర్‌గౌడ్ పార్టీలేమయ్యాయి?
నిబంధనల మేరకే మండలిలో కవితకు మాట్లాడే చాన్స్
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇప్పుడున్న పార్టీలే చాలని.. కొత్తగా పార్టీలు పెట్టేందుకు స్పేస్ లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం మండలిలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కవిత కొత్త పార్టీ ఏర్పాటు నేపథ్యంలో.. రాజకీయాల్లో ఎవరి ఆలోచనలు, అవకాశాలు వారివేనన్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా పార్టీ పెట్టి.. సమర్థంగా నడపడం.. అంత తేలిక కాదు. ఇక్కడ ఎన్నో పార్టీలు పుట్టి.. కనుమరుగయ్యాయి. కొత్త పార్టీ మనుగడ సాధించాలంటే దానికి సమయం కూడా అనుకూలించాలి. గతంలో చిరంజీవి, దేవేందర్‌గౌడ్ పార్టీలు పెట్టి ఏం చేశారో.. అందరికీ తెలిసిందే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చుకు వెనకాడకుండా.. సమస్యలను అధిగమిస్తూ.. వ్యయప్రయాసలతో పార్టీలను నడపాల్సి ఉంటుంది’ అని వివరించారు. ఇక శాసనమండలిలో నిబంధనల ప్రకారమే కవితకు మాట్లాడే అవకాశం కల్పించినట్లు గుత్తా చెప్పారు. ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో నిజాలు చెప్పారా..? అబద్ధాలు చెప్పారా? అని జడ్జ్ చేయడం తన బాధ్యత కాదన్నారు. గత 4 నెలల కిందే కవిత తన రాజీనామా లేఖను పీఏ ద్వారా పంపారని.. అయితే ఆవేశంతో తీసుకున్న నిర్ణయంగా భావించి ఆమోదించలేదని తెలిపారు.
చట్టసభల్లో భాష అదుపులో ఉండాలి..
‘అసెంబ్లీ, శాసనమండలి ఏదైనా సరే.. చట్టసభల్లో ప్రజా ప్రతినిధులు ఇబ్బందికర భాషను ప్రయోగించడం తగదు. అది ముఖ్యమంత్రి అయినా ఎవరైనా భాష విషయంలో ఆలోచన చేసి మాట్లాడాలన్నది నా అభిప్రాయం. మనం ఉపయోగించే పదాలు, భాషను బట్టే ఎదుటి వారు మనల్ని గౌరవిస్తారన్నది గుర్తించుకోవాల్సిన విషయం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కోట్లు ఖర్చు పెడతున్నారంటే.. బాధపడాల్సిన విషయం. మంచి వ్యక్తి పోటీలో ఉన్నా డబ్బులివ్వనిదే ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేకుండాపోతోంది. ఈ పరిస్థితి మారాలి.. లేదంటే భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితిని చవిచూడాల్సి వస్తుంది’ అని గుత్తా అభిప్రాయపడ్డారు.