Share News

ఇంటర్‌ ఫలితాల్లో గురుకులాల జోరు..

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:38 AM

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో రికార్డు సృష్టించారు.

ఇంటర్‌ ఫలితాల్లో గురుకులాల జోరు..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో రికార్డు సృష్టించారు. ఏకంగా 90శాతం ఉత్తీర్ణతతో సంక్షేమ గురుకులాల్లోనే ప్రథమ స్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి సీనియర్‌ ఇంటర్‌లో 7శాతం, జూనియర్‌ ఇంటర్‌లో 8 శాతం అదనంగా ఉత్తీర్ణత నమోదైంది. సీనియర్‌ ఇంటర్‌ బైపీసీలో శ్రియ (994), బి.హిమానీ (993), రాథోడ్‌ నందు (993) మార్కులతో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఎంపీసీలో బి.మధు (994), శ్రీనిధి (994) మార్కులు సాధించారు. సీఈసీలో శ్రీలత (981), ఎంఈసీలో జాహ్నవి (983), హెచ్‌ఈసీలో రాజేశ్వరి (980) టాపర్లుగా నిలిచారు. రెండో సంవత్సరం ఎంపీసీ విభాగంలో 97మంది, బైపీసీలో 62మంది విద్యార్థులు టాప్‌10 ర్యాంకులు సాధించారు. జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో పి.ప్రవల్లిక, కె.వైష్ణవితో సహా 16మంది విద్యార్థులు 468 మార్కులతో స్టేట్‌ ర్యాంకులు సాధించగా.. బైపీసీలో పి.రాఘవి, వి.హేమశ్రీతో సహా 11 మంది విద్యార్థులు 438మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించడంతో విద్యార్థులు, బోధనా సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభినందించారు. కాగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు.. మొదటి సంవత్సరంలో 13,611 మందికి 10,588 మంది (77.79 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 13,481 మందికి 11,894 మంది (88.22 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో 468 మార్కులను ఏడుగురు, బైపీసీలో 438మార్కులను ఐదుగురు, రెండోసంవత్సరం ఎంపీసీలో 995 మార్కులను ఇద్దరు, బైపీసీలో 994 మార్కులను ఒక్కరు సాధించారు. ఉత్తీర్ణతశాతం పెరగడం శుభపరిణామమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ తెలిపారు.

Updated Date - Apr 13 , 2026 | 05:38 AM