కవి, రచయిత, పాలపిట్ట మాసపత్రిక నిర్వాహకుడు గుడిపాటికి దాశరథి పురస్కారం
ABN , Publish Date - Jul 21 , 2026 | 04:11 AM
కవి, రచయిత, పాలపిట్ట సాహిత్య మాస పత్రిక నిర్వాహకుడు, సీనియర్ జర్నలిస్టు గుడిపాటి వెంకటేశ్వర్లు ప్రతిష్ఠాత్మక దాశరథి కృష్ణమాచార్య 2026 పురస్కారానికి ఎంపికయ్యారు.
సాహిత్య సేవకు గుర్తింపు.. ఎంపిక చేసిన అవార్డు కమిటీ
23న రవీంద్రభారతిలో ప్రదానోత్సవం
హైదరాబాద్ సిటీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కవి, రచయిత, పాలపిట్ట సాహిత్య మాస పత్రిక నిర్వాహకుడు, సీనియర్ జర్నలిస్టు గుడిపాటి వెంకటేశ్వర్లు ప్రతిష్ఠాత్మక దాశరథి కృష్ణమాచార్య 2026 పురస్కారానికి ఎంపికయ్యారు. అమ్మంగి వేణుగోపాల్ అధ్యక్షతన, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నరసింహారెడ్డి మెంబర్ కన్వీనర్‌గా ఆరుగురు సభ్యులతో కూడిన అవార్డు ఎంపిక కమిటీ గుడిపాటి పేరు ప్రతిపాదించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాశరథి జయంతి సందర్భంగా ఈ నెల 23న రవీంద్రభారతిలో పురస్కార ప్రదానోత్సవం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత గుడిపాటికి రూ1,01,116 నగదు పురస్కారాన్ని అందించి, శాలువా, జ్ఞాపికతో సత్కరిస్తారు. గుడిపాటి స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట. పాత్రికేయుడిగా సుదీర్ఘకాలం పని చేశారు. పాలపిట్ట సాహిత్య మాస పత్రికను 2010 నుంచి నిర్వహిస్తున్నారు. కవిత్వం, కథ, సాహిత్య విమర్శ తదితర ప్రక్రియల్లో రచనలు చేశారు. పలు వ్యాస, కథా సంకలనాలకు సంపాదకత్వం వహించారు. పాలపిట్ట విలక్షణ కథలు, దీపావళి, ఉగాది కథల సంచికలు ప్రతి ఏటా వెలువరించడం ద్వారా యువ రచయితలను గుడిపాటి ప్రోత్సహిస్తున్నారు.