గేమింగ్ సిండికేట్‌పై దాడులు
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:53 AM
ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌నకు సంబంధించిన పన్ను ఎగవేత కేసులో గేమింగ్ సిండికేట్‌ను జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు గుర్తించారు.
ముంబై, హైదరాబాద్‌లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న జీఎస్టీ అధికారులు
రూ.5వేల కోట్ల కుంభకోణమని అనుమానం
హైదరాబాద్, ఫిబ్రవరి8 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌నకు సంబంధించిన పన్ను ఎగవేత కేసులో గేమింగ్ సిండికేట్‌ను జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు గుర్తించారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో సోదాలు నిర్వహించి ప్రధాన పాత్రధారులైన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ముంబైకి చెందిన వైఎస్ ప్రభుకుమార్, హైదరాబాద్‌కు చెందిన రాజశేఖర్‌రెడ్డి ఈ సిండికేట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా జరిగే చెల్లింపులపై 28శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉండగా, మ్యూల్ బ్యాంకు ఖాతాలను వినియోగిస్తూ ఆదాయాన్ని ఇతర మార్గాలకు మళ్లించినట్లు అధికారుల దర్యాప్తులో బయటపడింది. ఈ ముఠా దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని, సుమారుగా రూ.5వేల కోట్ల పన్ను ఎగవేసినట్లు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. రెండు సాఫ్ట్‌వేర్ కంపెనీలను తెర ముందు పెట్టి ఆన్‌లైన్ గేమింగ్‌లో కీలకమైన పేమెంట్ గేట్‌వే వ్యవహరాలను చక్కదిద్దారని సమాచారం.