బోగస్ సంస్థలతో అక్రమంగా 98.47 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:57 AM
బోగస్ సంస్థలను సృష్టించి రూ.98.47 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)ను అక్రమంగా పొందిన ‘షా బ్యాటరీస్’ సంస్థ డైరెక్టర్ టీఏ అమిర్ హసన్‌ను రాష్ట్ర జీఎస్‌టీ అధికారులు అరెస్టు చేశారు.
‘షా బ్యాటరీస్’ డైరెక్టర్ అమిర్ హసన్ అరెస్టు
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): బోగస్ సంస్థలను సృష్టించి రూ.98.47 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)ను అక్రమంగా పొందిన ‘షా బ్యాటరీస్’ సంస్థ డైరెక్టర్ టీఏ అమిర్ హసన్‌ను రాష్ట్ర జీఎస్‌టీ అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు తన అనుచరుల ద్వారా 17 బోగస్ సంస్థలను సృష్టించి ఐటీసీని క్లెయిమ్ చేసుకుని ఆ తర్వాత వాటి జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ నెంబర్లను రద్దు చేసుకున్నారని జీఎ్‌సటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ సంస్థలన్నీ ప్రతి నెలా ఒకే కంప్యూటర్ ద్వారా రిటర్నులను దాఖలు చేసినట్లు గుర్తించారు. పన్నును ఎగ్గొట్టడానికి, అక్రమంగా ఐటీసీని పొందడానికి ఇలాంటి గిమ్మిక్కులు చేశారని వివరించారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ వరకు ‘షా బ్యాటరీస్’ సంస్థ రూ.571 కోట్ల టర్నోవర్‌ను ప్రకటించిందని, రూ.45.42 లక్షల పన్ను చెల్లించిందని తెలిపారు. అక్రమంగా ఐటీసీని పొందడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని, అయినా తన అక్రమాలు, పొరపాట్లను సరిదిద్దుకోవాలంటూ అమిర్ హసన్‌కు రెండు నెలల సమయం ఇచ్చామని వివరించారు. స్పందన లేకపోవడంతో అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారని తెలిపారు.