Manmohan Singh Name for New University Bill Passed: జీఎస్టీ ఎగవేతలపై పారదర్శక విచారణ
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:35 AM
వస్తుసేవల పన్ను(జీఎస్టీ)లో పలు సవరణల కోసం ఉద్దేశించిన ‘ది తెలంగాణ వస్తు సేవల పన్ను(సవరణ) బిల్లు-2026’, కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన భూవైజ్ఞానిక ...
మద్యంలో వాడే ఈఎన్‌ఏకు జీఎస్టీ మినహాయింపు
ఒకే పన్ను విధానం ఉండాలనేసవరణలు: జూపల్లి
ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి మన్మోహన్ పేరు
జీఎస్టీ, వర్సిటీల బిల్లులకు ఆమోదం
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): వస్తుసేవల పన్ను(జీఎస్టీ)లో పలు సవరణల కోసం ఉద్దేశించిన ‘ది తెలంగాణ వస్తు సేవల పన్ను(సవరణ) బిల్లు-2026’, కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన భూవైజ్ఞానిక (ఎర్త్ సైన్సెస్) విశ్వవిద్యాలయానికి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పేరు పెడుతూ తీసుకొచ్చిన ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ (సవరణ) బిల్లు-2026’కు సభ ఆమోదం తెలిపింది. జీఎస్టీ సవరణ బిల్లును మంత్రి జూపల్లి కృష్ణారావు, యూనివర్సిటీల బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. జీఎస్టీ సవరణ బిల్లులో పలు అంశాలను ప్రతిపాదించారు. మద్యం(లిక్కర్)లో వాడే ‘ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్(ఈఎన్‌ఏ)’ను జీఎస్టీ పరిధి నుంచి మినహాయిస్తూ సెక్షన్ 9ను సవరించారు. పన్ను ఎగవేత కేసుల విచారణలో మరింత పారదర్శకత కోసం సెక్షన్-74ఏను చేర్చారు. దీనివల్ల సాధారణ తప్పులుగా నమోదైన కేసులను విచారణ ఆధారంగా ‘మోసం(ఫ్రాడ్)’ కిందకు, మోసం కింద ఉన్న కేసులను సాధారణ తప్పుల కిందకు మార్చే వెసులుబాటు కలుగుతుంది. పాన్‌మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీదారులు పన్ను ఎగవేతకు పాల్పడకుండా ప్రత్యేక రిజిస్ట్రేషన్‌తోపాటు నిబంధనలను ప్రవేశ పెట్టారు. జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునళ్ల ఏర్పాటు, ఈ-కామర్స్ కార్యకలాపాలు, వోచర్లపై పన్ను విధింపు వంటి అంశాలపైనా స్పష్టత ఇచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐజీఎస్టీ, సీజీఎస్టీ చట్టాలను సవరించిందని, దానికి అనుగుణంగా రాష్ట్ర జీఎస్టీ చట్టంలో మార్పులు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను విధానం ఉండాలనే ఉద్దేశంతో ఈ సవరణలు చేపట్టామని తెలిపారు. కాగా, కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పేరు పెడుతూ ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ సవరణ బిల్లు-2026’ను ప్రవేశపెట్టగా... సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ తాజా చట్ట సవరణ ద్వారా ఈ వర్సిటీ పూర్తి స్వయం ప్రతిపత్తి లభిస్తుందన్నారు. బిల్లుపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ కామర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రి దామోదర స్పందిస్తూ.. కామర్స్ వర్సిటీ ఏర్పాటును పరిశీలిస్తామన్నారు.