Share News

‘గృహజ్యోతి’తో విద్యుత్తు చౌర్యం తగ్గింది

ABN , Publish Date - Mar 08 , 2026 | 05:02 AM

గృహజ్యోతి పథకం అమలుతో రాష్ట్రంలో విద్యుత్తు చౌర్యం గణనీయంగా తగ్గిందని దక్షిణ డిస్కమ్‌ (టీజీఎస్పీడీసీఎల్‌) ప్రకటించింది. తెలంగాణ విద్యుత్తు సంస్థలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను దాఖలు...

‘గృహజ్యోతి’తో విద్యుత్తు చౌర్యం తగ్గింది

  • రెవెన్యూలోటు రూ.9583 కోట్లు.. ప్రభుత్వం భరిస్తుందని ఆశిస్తున్నాం

  • విద్యుత్తు ఛార్జీలు పెంచడం లేదు

  • ఈఆర్‌సీ విచారణలో దక్షిణ డిస్కమ్‌

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): గృహజ్యోతి పథకం అమలుతో రాష్ట్రంలో విద్యుత్తు చౌర్యం గణనీయంగా తగ్గిందని దక్షిణ డిస్కమ్‌ (టీజీఎస్పీడీసీఎల్‌) ప్రకటించింది. తెలంగాణ విద్యుత్తు సంస్థలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను దాఖలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్‌ఆర్‌)పై శనివారం తెలంగాణ ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌, సభ్యులు కంచర్ల రఘు, చెరుకూరి శ్రీనివాసరావు బహిరంగ విచారణ నిర్వహించారు. గృహజ్యోతి పథకం కింద డిస్కమ్‌ పరిధిలో 30శాతం మంది గృహ వినియోగదారులున్నారని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి దాకా 5.44 కోట్ల జీరో బిల్లులు జారీ చేశామని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం రూ.1930.66 కోట్ల సబ్సిడీ ఇచ్చిందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 71,916 మిలియన్‌ యూనిట్లు విద్యుత్తు అసవరం ఉంటుందన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు చార్జీలు పెంచరాదని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రూ.50,242 కోట్ల ఆదాయం అవసరం ఉండగా.. ప్రస్తుత టారి్‌ఫతో రూ.40,659 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 12.09 లక్షల మంది వినియోగదారులు పెరిగారని, డిస్కమ్‌ పరిధిలో 1,20,95,963 మంది వినియోగదారులున్నారని, ప్రస్తుతం 35,175 ఏవీఏ కనెక్టెడ్‌ లోడ్‌ కలిగి ఉందని, ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు దాకా 39,556 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగిందని, ఇందులో గృహ విద్యుత్తు వాటా 23 శాతంగా ఉంటే.. పారిశ్రామిక రంగం వాటా 31 శాతం, వ్యవసాయ రంగం వాటా 21 శాతం, కమర్షియల్‌ 16 శాతం, ఇతర కేటగిరిల్లో 9 శాతం ఉందగా ఉందన్నారు.


కాగా డిస్కమ్‌లు దాఖలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల్లో రెవెన్యూ లోటు 30 శాతంగా ఉందని సెంటర్‌ ఫర్‌ పవర్‌ స్టడీస్‌ కన్వీనర్‌ ఎం.వేణుగోపాలరావు అన్నారు. డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదని చెప్పారు. విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కరెంట్‌ కొంటున్నా చెల్లింపులు చేయడం లేదని తెలిపారు. కాగా ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే 1912 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయాలంటున్నారని, ఆ నంబర్‌ పనిచేయడం లేదని, రైతులతో కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, లైన్‌మెన్లు, ఆర్టిజన్లు సమస్యలు పట్టించుకోవడం లేదని రంగారెడ్డి జిల్లా రైతు సత్యనారాయణ వివరించారు. హుస్నాబాద్‌ ప్రాంతంలోని తన మూడు ఎకరాల పొలంలో విద్యుత్తు శాఖ 20 స్తంభాలు, 15 సపోర్టు వైర్లు వేసిందని కావలి శేఖర్‌ అనే రైతు నివేదించారు. కాగా క్షేత్రస్థాయిలో పనులు చేసేందుకు ఎవరైనా డబ్బులడిగితే తన పేరు చెప్పాలని సీఎండీ జితేష్‌ వి.పాటిల్‌ సూచించారు. వినియోగదారులతో నిర్లక్ష్యంగా మాట్లాడే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయిన వికారాబాద్‌ జిల్లా ధరూర్‌ మండలం కేరెల్లికి చెందిన ఎన్‌.చంద్రారెడ్డి, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విశ్వనాథపల్లికి చెందిన కనకయ్య కుటుంబాలకు ఈఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ నాగార్జున్‌ చేతుల మీదుగా పరిహారం ఇచ్చారు.

Updated Date - Mar 08 , 2026 | 05:04 AM