‘గృహజ్యోతి’తో తగ్గిన విద్యుత్ చౌర్యం
ABN , Publish Date - Feb 19 , 2026 | 05:07 AM
రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలులోకి వచ్చిన తర్వాత విద్యుత్ చౌర్యం కేసులు గణనీయంగా తగ్గినట్టు విద్యుత్ పంపిణీ సంస్థల గణాంకాలు చెబుతున్నాయి.
రెండేళ్లలో భారీగా తగ్గిన కేసులు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలులోకి వచ్చిన తర్వాత విద్యుత్ చౌర్యం కేసులు గణనీయంగా తగ్గినట్టు విద్యుత్ పంపిణీ సంస్థల గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి నుంచి గృహజ్యోతి పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పథకం కింద తెల్లరేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. అయితే, గృహజ్యోతి పథకం ప్రారంభమైన తర్వాత రెండేళ్లుగా డైరెక్ట్ మీటర్ ట్యాపింగ్(విద్యుత్ తీగలకు అక్రమంగా తీగలు తగిలించి విద్యుత్ చౌర్యానికి పాల్పడడం) కేసులు భారీగా తగ్గాయి. 2023-24లో టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని 21 సర్కిళ్లలో 57,202 డైరెక్టు ట్యాపింగ్ కేసులు నమోదవ్వగా 2024-25లో 15003 కేసులు నమోదయ్యాయి. 2025-26 ఫిబ్రవరి 10వ తేదీ నాటికి 11,928 కేసులు నమోదయ్యాయి. దక్షిణ డిస్కం పరిధిలో ఏడాదిలో 2-3 వేలకు పైగా డైరెక్టు ట్యాపింగ్ కేసులు నమోదైతే గత రెండేళ్లుగా ఈ కేసుల సంఖ్య వందల్లోకి చేరినట్టు రికార్డులు చెబుతున్నాయి.