Share News

‘ట్రాఫిక్‌’లోకి గ్రేహౌండ్స్‌!

ABN , Publish Date - Jul 02 , 2026 | 04:55 AM

చిరుతలాంటి దూకుడు.. కొండలు, కోనలను అవలీలగా దాటే సాహసం.. వీపుపై 5కిలోల బరువుతోనూ వేగంగా పరిగెత్తగలిగే సామర్థ్యం..

‘ట్రాఫిక్‌’లోకి గ్రేహౌండ్స్‌!

  • ఉన్నతాధికారుల నిర్ణయంపై విమర్శలు

  • ఇన్నాళ్లూ దండకారణ్యంలో ప్రాణాలకు తెగించి గ్రేహౌండ్స్‌ కమాండోల పోరాటం

  • మావోయిస్టుల లొంగుబాటుతో గ్రేహౌండ్స్‌ విభాగాన్ని ఖాళీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

  • వారి శక్తి సామర్థ్యాలను వాడుకోకుండాట్రాఫిక్‌ వంటి విభాగాలకు కేటాయింపు

హైదరాబాద్‌ సిటీ, జూలై 1(ఆంధ్రజ్యోతి): చిరుతలాంటి దూకుడు.. కొండలు, కోనలను అవలీలగా దాటే సాహసం.. వీపుపై 5కిలోల బరువుతోనూ వేగంగా పరిగెత్తగలిగే సామర్థ్యం.. అనుక్షణం అప్రమత్తత.. తుపాకులతో సహవాసం.. కంట్లో భయం ఉండదు.. ఒంట్లో ఒణుకు ఉండదు..! ఇదంతా దేశ సరిహద్దులోని సైనికుల గురించి అనుకుంటున్నారా.. కాదు..! రాష్ట్రంలోని దండకారాణ్యంలో కంటిమీద కునుకులేకుండా మావోయిస్టులతో ఏళ్ల తరబడి పోరాటం చేసిన గ్రేహౌండ్స్‌ విభాగం కమాండోల గురించి! రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోవడంతో ప్రస్తుతం గ్రేహౌండ్స్‌ విభాగాన్ని ఖాళీ చేసి, సిబ్బందిని పోలీసు శాఖలోని లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ వంటి విభాగాలకు కేటాయిస్తున్నారు. మెరికల్లాంటి కమాండోల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు విధులు కేటాయిస్తున్న తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆక్టోపస్‌, ఈగల్‌, సీఐసెల్‌, ఎస్‌ఐబీ వంటి ప్రత్యేక విభాగాలకు కేటాయించకుండా.. ట్రాఫిక్‌ వంటి విభాగాలకు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే గ్రేహౌండ్స్‌ కమాండోలను తయారుచేయాలంటే కొన్నేళ్ల పాటు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. వారిని సమాజానికి సవాల్‌గా మారిన సమస్యలపై యుద్ధానికి వినియోగించుకోపోతే వారి శక్తి సామర్థ్యాలు వృథా అవుతాయని పలువురు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.


అరాచక శక్తుల ఆట కట్టించాలంటే..

ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో డ్రగ్స్‌ మహమ్మారి ఒకటి. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. కొన్ని అరాచక శక్తులు పాఠశాలలు మొదలు యూనివర్సిటీల వరకు విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్‌ను అలవాటు చేస్తున్నారు. ఆ శక్తుల ఆటకట్టించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఈగల్‌’, హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌న్యూ) విగాభాలు ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించిన ఈ విభాగాలు అనుకున్న స్థాయిలో గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టలేకపోతున్నాయి. ఈ యుద్ధం లో మెరికల్లాంటి గ్రేహౌం డ్స్‌ కమాండోలను వినియోగిస్తే డ్రగ్స్‌ స్మగ్లర్ల పీచమణచవ్చని పలువురు పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి జిల్లాకు 2, 3 ప్లటూన్ల చొప్పున కమాండోలను కేటాయించాలని, ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ వంటి జిల్లాల్లో రంగంలోకి దింపాలని సూచిస్తున్నారు. గంజాయి సాగు, సరఫరా ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలపై దృష్టి పెట్టి, ప్రత్యేక బృందాలను పంపితే సత్ఫలితాలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు గ్రేహౌండ్స్‌ కమాండోలను ఆక్టోపస్‌, సీఐసెల్‌ ఎస్‌ఐబీ వంటి ప్రత్యేక విభాగాలకు కేటాయిస్తే దన్నుగా నిలుస్తారని సూచిస్తున్నారు. కాగా, ప్రస్తుతం గ్రేహౌండ్స్‌ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే వేతనంతో పాటు.. కేంద్ర ప్రభుత్వం 60 శాతం అదనపు జీతం చెల్లిస్తోంది. ఇప్పుడు వారికి ట్రాఫిక్‌ వంటి విభాగాల్లో విధులు కేటాయించడం వల్ల కేవలం 30 శాతం అదనపు వేతనమే అందుతుంది. దాంతో వారు ఇబ్బంది పడే అవకాశం ఉందంటున్నారు.

Updated Date - Jul 02 , 2026 | 04:55 AM