Share News

రైతుకు ’మరింత సహకారం’

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:36 AM

జిల్లాలో సహకార వ్యవస్థను మరింత పటిష్టపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే కీలకమైన పీఏసీఎస్‌ (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం)ల అభ్యున్నతి

రైతుకు ’మరింత సహకారం’

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాలో సహకార వ్యవస్థను మరింత పటిష్టపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే కీలకమైన పీఏసీఎస్‌ (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం)ల అభ్యున్నతికి పాటుపడుతోంది. ఇప్పటికే వాటి ద్వారా అన్నదాతలకు అందుతున్న బ్యాంకింగ్‌, ఇతర సేవల్లో సాంకేతికతను అందిస్తోంది. తాజాగా ఇప్పుడున్న సంఘాలకు అదనంగా కొత్తగా ఏడు పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఎప్పటినుంచో వీటి ఏర్పాటు కోసం నిరీక్షిస్తున్న రైతాంగానికి ఈ నిర్ణయం ఊరటను కలిగిస్తోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్న కర్షకులకు కొండంత అండనిస్తున్నాయి. రుణాలను అందించడమే కాకుండా ఎరువులు, విత్తనాల సరఫరా, ధాన్యం కొనుగోళ్లు, అద్దెకు యంత్రాలు, వివిధ వ్యాపారాల నిర్వహణతో రైతులతో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంటోంది.

ఫ కొత్తగా ఏర్పాటైనవివే...

----------------------------

పీఏసీఎస్‌ మండలం

----------------------------

వెదిరె రామడుగు

ఇందుర్తి చిగురుమామిడి

గర్శకుర్తి గంగాధర

ఆకునూర్‌ సైదాపూర్‌

చల్లూర్‌ వీణవంక

ఎలగందుల కొత్తపల్లి

గన్నేరువరం గన్నేరువరం

------------------------------

ఫ 37కు పెరిగిన సంఖ్య...

జిల్లాల పునర్విభజన తర్వాత కరీంనగర్‌ జిల్లాలో పీఏసీఎస్‌ల సంఖ్య 30కి పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో 135 పీఏసీఎస్‌లు ఉండేవి. జిల్లాల విభజన తర్వాత జిల్లా పరిధిలో 30 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు వాటి కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నాయి. వీటి పాలకవర్గాల పర్యవేక్షణలో సేవలు ఇంతకింతకు పెరుగుతున్నాయి. ప్రతి పీఏసీఎస్‌ పరిధిలో గ్రామాలు అధికంగా ఉండడంతో రైతుల సంఖ్య పెరుగుతోంది. వారి ఖాతాల నిర్వహణ, సేవల పరంగా లోపాలు తలెత్తుతుండడంతో మండలానికి మూడు నుంచి నాలుగు పీఏసీఎస్‌లు ఉండాలనే డిమాండ్‌ దశాబ్ద కాలంగా వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయంలోనూ జిల్లా సహకారశాఖ నుంచి కొత్తవి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వెళ్లాయి. ఇటీవల కాలంలో జిల్లానుంచి దాదాపు 15 సహకార సంఘాల ఏర్పాటుకు వినతులు సర్కారు దృష్టికి చేరాయి. కచ్చితంగా కొత్త సంఘం అవసరముందనుకున్న చోటనే కొత్త పీఏసీఎస్‌ను ఏర్పాటు చేస్తూ అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం 30 ఉన్న సంఘాలకు అదనంగా మరో ఏడు కొత్త పీఏసీఎస్‌లు కొలువుదీరబోతున్నాయి. దీంతో జిల్లాలోని పీఏసీఎస్‌ల సంఖ్య 37కు చేరుతుంది.

Updated Date - Nov 19 , 2026 | 01:36 AM