kumaram bheem asifabad- గ్రాసం కరువు.. పశు పోషణ బరువు
ABN , Publish Date - May 02 , 2026 | 10:27 PM
జిల్లాలో పశుగ్రా సం కరువైంది. వేసవి వచ్చిదంటే పశువులకు మేత కష్టాలు తప్పవు. వేసవికాలంలో మేత, నీరు దొరక్క మూగ జీవాలు అల్లాడుతున్నాయి. పశుగ్రాసం కరువు కావడంతో రైతులు పొరుగు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కానీ మేత కంటే గ్రాసం రవాణాకే రైతులకు తడిసి మోపెడవుతోంది. లారీ గడ్డి రూ.30 వేల నుంచి రూ.32 వేల వరకు పెట్టి కోనుగోలు చేస్తున్నారు.
- వరి సాగు తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు
- తడిసి మోపెడవుతున్న రవాణా ఖర్చులు
ఆసిఫాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పశుగ్రా సం కరువైంది. వేసవి వచ్చిదంటే పశువులకు మేత కష్టాలు తప్పవు. వేసవికాలంలో మేత, నీరు దొరక్క మూగ జీవాలు అల్లాడుతున్నాయి. పశుగ్రాసం కరువు కావడంతో రైతులు పొరుగు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కానీ మేత కంటే గ్రాసం రవాణాకే రైతులకు తడిసి మోపెడవుతోంది. లారీ గడ్డి రూ.30 వేల నుంచి రూ.32 వేల వరకు పెట్టి కోనుగోలు చేస్తున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వివిధ గ్రామాల్లో రైతులకు పశు పోషణ పెను భారంగా మారింది. జిల్లాలో వరి పంట అతి తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. జిల్లాలో దహెగాం, సిర్పూర్(టి), తిర్యాణి, రెబ్బెన, కౌటాల, బెజ్జూరు, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మండలాల్లో మాత్రమే వరి సాగు చేస్తుంటారు. వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల్లో నీటి లభ్యత లేని కారణంగా అక్కడి రైతులు ఆరుతడి పంటలైన పత్తి, సోయా పంటలనే వేస్తుంటారు. దీంతో ప్రస్తుతం గ్రామాల్లో గ్రాసం కోసం రైతులు ఇబ్బందులు పడుతూ ఈ వేసవిలో పశువులకు గ్రాసం ఎలా సమకూర్చాలో అర్థంకాక రైతులు ఆందో ళన చెందుతున్నారు.
- జిల్లాలో పశు సంపద ఇలా..
జిల్లాలో 10,17,833 పశువులు ఉండగా ఆవులు 2,78,674, బర్రెలు 51,354, గొర్రెలు 83,813, మేకలు 1,84,726 ఉన్నట్లు పశువైద్యాధికారులు చెబుతున్నారు. వీటన్నింటికి సరిపడ గ్రాసం లేక ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అనుకున్నంత స్థాయిలో వరి సాగు చేయక పోవడంతో పక్క జిల్లాలోనైన మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి రైతులు వరి గడ్డిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గడ్డి కొరత ఏర్పడి డిమాండ్ బాగా పెరిగింది. లారి గడ్డి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టి కొనాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పశు వైద్య కేంద్రాల ద్వారా గ్రాసం సరఫరా చేస్తే ఊరట లభిస్తుందని జిల్లాలోని రైతులు విన్నవించుకుంటున్నారు.
- తీవ్రంగా పశుగ్రాసం కొరత..
జిల్లా అంతటా పశుగ్రాసం కొరత తీవ్ర రూపం దాల్చింది. పశుగ్రాసం కోసం రైతులు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. ఓ వైపు తాగునీరు, మరో వైపు పశుగ్రాసం లభించక పశువులు బక్కచిక్కి పోతున్నాయి. దీంతో రైతులకు పశు పోషణ భారం కావడంతో కబేళాలకు అమ్మేస్తున్నారు. ఇక ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణ ప్రాంతంలో పశువుల తీరు దయనీయంగా మారింది. గ్రాసం దొరకక చెత్త కుప్పలపై ఉన్న కాగితాలను, ప్లాస్టిక్ కవర్లను తింటూ మురికి కాలువల్లో నీటిని తాగుతూ వాఽ్యధుల బారిన పడుతున్నాయి. ఇప్పటి వరకు పశుగ్రాసం కొరతను తీర్చేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు నీటి వసతి ఉన్న ప్రాంతాలను గుర్తించి పశుగ్రాసం పెంచే విధంగా రైతుల్లో అవగాహన కల్పించడం లేదంటున్నారు. పశు సంవర్ధక శాఖాధికారులు పట్టించుఓక పోవడంతో పశుగ్రాసాన్ని పెంచేందు కు ఆసక్తి చూపడం లేదు.
పొరుగు జిల్లాల నుంచి పశుగ్రాసం తీసుకొస్తున్నాం..
- పుల్గం పోచన్న, రైతు, ఆసిఫాబాద్
పశుగ్రాసం కొరత తీవ్రంగా ఏర్పడడంతో మంచిర్యాల జిల్లా దండెపల్లి నుంచి వరి గడ్డిని కొనుగోలు చేసి తీసుకు వస్తున్నాం. జిల్లాలో వరి సాగు అంతంత మాత్రంగానే ఉండడంతో పోరుగు జిల్లాల నుంచి రవాణా చేసుకోవాల్సి వస్తున్నది. దీంతో రైతుల పై అర్థికంగా భారం పడుతోంది. లారీ పశుగ్రాసానికి రూ.30 వేల నుంచి రూ.32 వేలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాం . ఆర్థిక స్థోమత లేని రైతులకు పశువుల పోషణ భారమవుతున్నది. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.