వైభవంగా వసంత పంచమి వేడుకలు
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:57 AM
రాష్ట్రవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది.
బాసరలో భారీగా అక్షర శ్రీకార పూజలు
108 వీణలతో ‘కచ్చపి అష్టోత్తర స్వరార్చన’
వర్గల్ సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు
బాసర, వర్గల్, భద్రాచలం, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. చదువుల తల్లి జన్మదినాన తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిేస్త విజ్ఞానవంతులు అవుతారనే నమ్మకంతో దాదాపు లక్ష మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తమకుమార్తెకు అక్షరాభ్యాసం చేయించారు. క్షేత్ర ప్రాంగణంలో నిర్వహించిన ‘కచ్చపి అష్టోత్తర వీణా స్వరార్చన’ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. హైదరాబాద్ త్యాగరాజ మ్యూజిక్ కళాశాల శ్రీ భక్తరామదాస్ మ్యూజిక్ కళాశాల వీణా అధ్యాపకురాలు పోతరాజు జయలక్ష్మి పర్యవేక్షణలో 108 మంది శిష్య బృందం ఏకకాలంలో వీణలను మీటుతూ అమ్మవారికి స్వర నీరాజనాలు అర్పించారు. సిద్దిపేట జిల్లా వర్గల్‌లో శ్రీ విద్యా సరస్వతీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు కనుల పండువగా జరిగాయి. సుమారు 60 వేల మంది క్షేత్రాన్ని సందర్శించారు. పుష్పగిరి పీఠాధిపతి విద్యా శంకర భారతీ స్వామి, మెదక్ రంగంపేట పీఠాధిపతి మాధవనంద సరస్వతీ స్వామి హాజరై సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భద్రాద్రి రామయ్యకు నవరత్న కీర్తనల నీరాజనం
భక్తరామదాసు 393వ జయంతి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆద్వర్యంలో శుక్రవారం ప్రయుక్త వాగ్గేయకార ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. మల్లాది సూరిబాబు బ్రదర్స్ పర్యవేక్షణలో భద్రాచల రామదాసు నవరత్న కీర్తనలతో వందలాదిమంది సంగీత కళాకారులు రామయ్యకు స్వరనీరాజనం పలకడంతో రామ భక్తులు పరవశించారు.