రామ చక్కని సీతకి..
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:05 AM
దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం శుక్రవారం వైభవంగా జరిగింది.
భద్రాచలంలో నేత్రపర్వంగా సీతారాముల కల్యాణం
పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం దంపతులు
వేడుకకు అశేష భక్తజనం, తరలివచ్చిన మంత్రులు, న్యాయమూర్తులు
నేడు శ్రీరామ మహా పట్టాభిషేకం.. హాజరుకానున్న గవర్నర్ శివప్రతాప్
శ్రీ లక్ష్మీనారాయణ గోత్రంతోనే రాములోరి కల్యాణం
భద్రాద్రి పురోహిత సంఘం సహా పలు సంస్థల అభ్యంతరం
నేడు సీతారాముల గోత్ర నామంతో కల్యాణం జరిపించనున్నట్లు ప్రకటన
భద్రాచలం/ కొత్తగూడెం మార్చి 27 (ఆంధ్రజ్యోతి): దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం శుక్రవారం వైభవంగా జరిగింది. వేల మంది భక్తుల ‘శ్రీరామ’ నామస్మరణతో భద్రాచలం పులకించింది. శ్రీ పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ నవమి పర్వదినాన సీతారాముల కల్యాణాన్ని పురోహితులు శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తరామదాసు చేయించిన మూడు సూత్రాల మంగళసూత్రాన్ని భక్తజనకోటి కనులారా తిలకిస్తుండగా వేద పండితులు.. సీతమ్మ వారికి ధరింపజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు రాములోరి కల్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించి తరించారు. భక్తజనంతో రామాలయంతో పాటు కల్యాణ మండపం కళకళలాడింది.

తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు..
శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకే పూజారులు ఆలయాన్ని తెరిచి స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళశాసనం, అభిషేకం జరిపారు. తర్వాత ధ్రువమూర్తులకు కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. అనంతరం ఉదయం 9.25 గంటలకు కల్యాణమూర్తుల ఊరేగింపు ప్రారంభమై, మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి 9.55 గంటలకు చేరుకొంది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వర్ణ సింహాసనంపై సీతారాములను ఆసీనులను గావించారు. తొలుత తిరువారాధన, విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించి మండపం శుద్ధిచేశారు. వేద పండితులు సంకల్పంతో స్వామి వారికి ఎదురుగా సీతమ్మను కూర్చోబెట్టి కన్యావరణలు జరిపారు. రక్షాబంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ నిర్వహించారు. యోక్త బంధనం, వధూవరుల వంశ గోత్రాలకు సంబంధించిన ప్రవరలు ప్రవచించారు. ఆశీర్వచనం, పాద ప్రక్షాళన, పుష్పోదక స్నానం జరిపి వరపూజ నిర్వహించారు. భక్తరామదాసు చేయించిన నగలను వధూవరులకు ధరింపజేశారు. పచ్చల పతకం, చింతాకు పతకం, రామమాడ తదితర ఆభరణాలను సీతారామ లక్ష్మణులకు ధరింపజేయడంతో మరింత శోభ చేకూరింది. టీటీడీ, శృంగేరి శారదా పీఠం, చినజీయర్ స్వామి మైసూరు దత్తపీఠం, పమిడిఘంటం వెంకటరమణ హరిదాసు అంబాసత్రం, భక్తరామదాసు వారసుడు కంచర్ల శ్రీనివాసరావు, రాజా తూము లక్ష్మీనరసింహదాసు వంశీకుల తరఫున వారివారి ప్రతినిధులు సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు. భద్రాద్రి రాముని కల్యాణ వైభవ ప్రాశస్త్యాన్ని దేవస్థానం స్థానాచార్యులు కేఈ స్థలశాయి, రామాయణ పారాయణదారులు ఎస్టీజీ అంతర్వేది కృష్ణమాచార్యులు వివరించారు. కన్యాదానం, గోదానం, భూదాన కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉత్సవమూర్తుల శిరస్సులపై ధరింపజేశారు. అనంతరం దశరధుడు, జనకమహారాజు, భక్తుల తరఫున భక్త రామదాసు చేయించిన మూడు మంగళసూత్రాలతో సూత్రధారణ కన్నుల పండువగా నిర్వహించారు. ఆ తరువాత తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. చివరగా భాగవతోత్తముల ఆశీర్వచనంతో కల్యాణ ఘట్టం ముగిసింది. శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని మిథిలా స్టేడియంలో శనివారం నిర్వహించనున్నారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

రెండోసారి పట్టు వస్ర్తాలు సమర్పించిన సీఎం రేవంత్ దంపతులు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భద్రాచలం సీతారాములకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించడం ఇది రెండోసారి. తన సతీమణి గీత, కుమార్తె నైమిషారెడ్డి, అల్లుడు సత్యనారాయణరెడ్డితో కలిసి భద్రాచలం చేరుకున్న సీఎంకు దేవాదాయ శాఖ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, వాకిటి శ్రీహరి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సృజన, జస్టిస్ జె.శ్రీనివాస్, జస్టిస్ యారా రేణుక, జస్టిస్ శ్రీసుధ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య త దితరులు పాల్గొన్నారు.
అధికారుల అత్యుత్సాహం
సీతారాముల కల్యాణం సందర్భంగా కొందరు అధికారుల తీరు విమర్శలపాలైంది. భద్రాద్రి దేవస్థానం ఈవో కె.దామోదర్‌రావు అధికారిక వాహనంలో ఆలయానికి వస్తుండగా పోలీసులు అడ్డుకోవటంతో ఆయన కాలినడకన గుడికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే సమయంలో కూడా పోలీసులు అడ్డుకున్నారు. తాను ఆలయ ఈవోనని చెప్పగా.. ‘అయితే ఏంటి? పక్క నుంచి వెళ్లండి’ అంటూ ఓ పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. భద్రాద్రి రామాలయాన్ని నిర్మించిన భక్తరామదాసు వారసులైన కంచర్ల శ్రీనివాసరావు దంపతులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. పట్టువస్త్రాలు తీసుకొచ్చిన రాజా తూము లక్ష్మీనరసింహదాసు వంశీకులు, టీటీడీ ప్రతినిధులకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. కల్యాణ మహోత్సవాన్ని కవర్ చేసే మీడియా ప్రతినిధులకు జారీచేసిన పాసులపై సైతం ఒక ప్రత్యేక అధికారి అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాత్రికేయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గత 26 ఏళ్లుగా భద్రాద్రి రామయ్య కల్యాణానికి ఏపీలోని మండపేట నుంచి సీతారాముల పేర్లతో అలంకరణ చేసి కొబ్బరిబొండాలను తెస్తున్న రాంరెడ్డి కుటుంబ సభ్యులను కూడా అధికారులు అడ్డుకోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల తీరుపై కంచర్ల శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.


భద్రాద్రి కల్యాణంలో ఎప్పటికీ లక్ష్మీనారాయణ గోత్ర ప్రవరే చెబుతాం
భద్రాచలంలో పూర్వం నుంచీ సీతారాముల కల్యాణంలో లక్ష్మీనారాయణ గోత్ర ప్రవరే చెప్పడం జరుగుతోందని.. ఇకపైనా అదే గోత్ర ప్రవరను చెబుతామని దేవస్థానం ఉప ప్రధాన అర్చకుడు అమరవాది మురళీకృష్ణమాచార్యులు తెలిపారు. రామయ్య కల్యాణం జరుగుతున్న సమయంలో వ్యాఖ్యాతలు కల్యాణ విశిష్టతను వెల్లడిస్తున్న క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై అంతర్జాతీయ గాంధీపథం, భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి, భద్రాది పురోహిత సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. సీతారాములకు జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ గోత్ర ప్రవరలైన అచ్యుత- సౌభాగ్య గోత్రాలు చెప్పి, మొక్కుబడిగా శ్రీరామచంద్ర స్వామినే వరాయ అంటూ కల్యాణ తంతు ముగించారని విమర్శించాయి. అర్చకులు ఈ విధంగా వ్యవహరించడం సమంజసం కాదని పేర్కొన్నాయి. శనివారం భద్రాచలంలోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్‌లో సీతారాముల కల్యాణాన్ని స్వామివారి గోత్ర ప్రవరలతో నిర్వహించనున్నట్లు తెలిపాయి.

ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ
సీతారాముల కల్యాణం సందర్భంగా భద్రాద్రి దేవస్థానం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేశారు. మంత్రులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న అనంతరం పట్టువస్త్రాలు సమర్పించే ముందు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.586 కోట్లతో దేవస్థానం అభివృద్ధి పనులకు ప్రణాళిక రూపొందించగా, మొదటి దశలో రూ.351 కోట్లతో పనులు చేపడుతున్నారు. గోదావరి పుష్కరాల సమయానికి మొదటిదశ పనులు పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కృష్ణా పుష్కరాల సమయానికి రెండో దశ అభివృద్ధి పనులు పూర్తిచేస్తామని చెప్పారు.