చెర్వుగట్టుపై వైభవంగా లక్ష పుష్పార్చన
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:38 AM
ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష పుష్పార్చన మంగళవారం వైభవంగా నిర్వహించారు.
నార్కట్‌పల్లి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష పుష్పార్చన మంగళవారం వైభవంగా నిర్వహించారు. ప్రతీ నెల అమావాస్య రోజున ఆలయ మహామంటపంలో నిర్వహించే ఈ వేడుకను భక్తులు పెద్దసంఖ్యలో వీక్షించే అవకాశాన్ని కల్పించే సంకల్పంతో ఈ పర్యాయం కల్యాణ మంటపంలో వేడుకను నిర్వహించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో చెర్వుగట్టు క్షేత్రానికి తరలివచ్చారు. తొలుత ప్రధానాలయం నుంచి పల్లకిసేవతో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను సన్నా యి వాయిద్యాలు భక్తుల శివనామస్మరణల మధ్య కల్యాణ మంటపానికి చేర్చారు. అనంతరం ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ సహా అర్చకు లు సతీశ్ శర్మ, సురేశ్ శర్మ ఇతర వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య లక్ష పుష్పార్చన వేడుక జరిగింది. స్వామి పాదాల చెంత పూజలందుకున్న పుష్పాలను స్వీకరించేందుకు భక్తులు పోటీపడ్డారు.అమావాస్య రోజున స్వామిదర్శనం చేసుకుని కొండపై నిద్రిస్తే మానసిక రుగ్మతలు తొలగిపోతాయనే విశ్వాసంతో భక్తులు కొండపై దొరికిన చోటల్లా నిద్రించారు. ఈ వేడుకలో దేవస్థాన ట్రస్టుబోర్డు చైర్మన్ వారాల రమేశ్, ధర్మకర్తలు, ఈవో సల్వాది మోహన్‌బాబు, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.