Grama Revenue Record: గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రింట్లు ఏవి?
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:52 AM
గతంలో ధరణి వ్యవస్థతో గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వీఆర్‌ఏ, వీఆర్వో వ్యవస్థలను రద్దు చేయడంతో రికార్డుల నిర్వహణను గాలికి వదిలేశారు.
భూ భారతి చట్టంలో పేర్కొన్నా.. రాష్ట్రంలో ఎక్కడా ప్రింట్లు తీయని వైనం
సీసీఎల్‌ఏ ఆదేశాలు ఇవ్వలేదంటున్న తహసీల్దార్లు
హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్ర జ్యోతి): గతంలో ధరణి వ్యవస్థతో గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వీఆర్‌ఏ, వీఆర్వో వ్యవస్థలను రద్దు చేయడంతో రికార్డుల నిర్వహణను గాలికి వదిలేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రామ రెవెన్యూ వ్యవస్థను గాడిన పెట్టే పనిలో పడింది. గ్రామస్థాయి రెవెన్యూ రికార్డుల నిర్వహణను అమల్లోకి తెచ్చింది. పహాణీలను భద్రపరచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. గత ఏడాది ఏప్రిల్ 14న అమల్లోకి వచ్చిన భూభారతి చట్టంలోనూ గ్రామ రికార్డుల నిర్వహణపై స్పష్టత ఇచ్చింది. చట్టంలోని సెక్షన్ 13, రూల్ 12 ప్రకారం గ్రామ పహాణి, ప్రభుత్వ భూముల రిజిస్టర్, మార్పుల రిజిస్టర్, నీటి వనరుల రిజిస్టర్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. భూమి హక్కుల రికార్డులోని వివరాలను ఆన్‌లైన్‌లోనూ నమోదు చేస్తారు. మ్యుటేషన్ జరిగిన ప్రతీసారి ఆన్‌లైన్ రికార్డుల్లో ఉన్న గ్రామ లెక్కల్లో మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో మోసాలకు తావు లేకుండా ఏటా డిసెంబరు 31న గ్రామ రెవెన్యూ రికార్డులను ప్రింట్ తీసి భద్రపరచాలని భూ భారతి చట్టంలో పేర్కొన్నారు. అయితే గత డిసెంబరు 31న ఎక్కడా ఈ ప్రక్రియను చేపట్టలేదు. గ్రామ రికార్డులను డిసెంబరు 31న ప్రింట్ తియ్యాలని సీసీఎల్‌ఏ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తహసీల్దార్లు చెబుతున్నారు. రాష్ట్రంలో 621మండలాలు, 10954 రెవెన్యూ గ్రామాల్లో ఎక్కడా ఇది అమలు కాలేదు. ధరణిలో ఎవరైనా తమ రికార్డులను కనిపించకుండా చేసుకునేలా సాఫ్ట్‌వేర్‌లో వెసులుబాటు ఉండేది. భూభారతిలో హక్కుల రికార్డులను పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉంచాలని సెక్షన్ 12, రూల్ 11 కింద వెసులుబాటు కల్పించారు. ఎవరైనా భూ హక్కుల రికార్డు సర్టిఫైడ్ కాపీ కావాలంటే.. రూ.10 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఆ మేరకు తహసీల్దార్లు సర్టిఫైడ్ కాపీలను అందజేస్తారు.