Share News

కోతలు లేకుండా ధాన్యం కొనాలి

ABN , Publish Date - May 15 , 2026 | 12:52 AM

కోతలు లేకుండా ధాన్యం కొనుగోళ్లను నిర్వహించాలని, రైస్‌ మిల్లుల వద్ద యుద్ధ ప్రాతిపదికన అన్‌లోడింగ్‌ చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. చొప్పదండి మార్కెట్‌ యార్డు, ఆర్నకొండ కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ చిత్రా మిశ్రా, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గురువారం

కోతలు లేకుండా ధాన్యం కొనాలి
చొప్పదండిలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

చొప్పదండి, మే 14 (ఆంధ్రజ్యోతి): కోతలు లేకుండా ధాన్యం కొనుగోళ్లను నిర్వహించాలని, రైస్‌ మిల్లుల వద్ద యుద్ధ ప్రాతిపదికన అన్‌లోడింగ్‌ చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. చొప్పదండి మార్కెట్‌ యార్డు, ఆర్నకొండ కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ చిత్రా మిశ్రా, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గురువారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్‌ చిత్రా మిశ్రా మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని, అవసరం ఉన్న లారీలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అవసరమైతే ట్రాక్టర్లను పెద్ద ఎత్తున వినియోగించాలని ఆదేశించారు. ఽఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. పెద్దకుర్మపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 40 కిలోల ధాన్యం బస్తాకు అదనంగా 3.25 కిలోల కటింగ్‌ పెడుతున్నారని రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సీపీ గౌస్‌ఆలం, ఆర్డీవో మహేశ్వర్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, డీఎం రజనీకాంత్‌, తహసీల్దార్‌ నవీన్‌కుమార్‌, మార్కెట్‌ చైర్మన్‌ కొత్తూరు మహేష్‌ పాల్గొన్నారు.

ఫ గంగాధరలో..

గంగాధర: కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిషన్‌ మోడ్‌లో తరలించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. గంగాధర మార్కెట్‌యార్డు, మధురానగర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోళ్ల పరిస్థితిపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డెడ్‌లైన్‌ ప్రకారం ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. తూకం వేసిన ధాన్యాన్ని మూడు రోజుల్లోగా మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం అన్‌లోడ్‌ సందర్భంగా మిల్లర్లు ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రైతుల ధాన్యం సకాలంలో కొనుగోలుచేసి త్వరగా మిల్లులకు తరలించాలన్నారు. కార్యక్రమంలో సీపీ గౌస్‌ఆలం, ఆర్డీవో మహేశ్వర్‌, పౌరసరఫరాల జిల్లా అధికారి నర్సింగరావు, డీఏం రజనికాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2026 | 12:52 AM