Share News

Uttam Kumar Reddy: సాగు యంత్రాలు 50 శాతం రాయితీతో!

ABN , Publish Date - Jan 10 , 2026 | 05:30 AM

ప్రభుత్వం రైతులకు సంక్రాంతి కానుకగా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించింది. కొన్నేళ్లుగా నిలిచిపోయిన ఈ పథకాన్ని పునరుద్ధరిస్తూ.....

Uttam Kumar Reddy: సాగు యంత్రాలు 50 శాతం రాయితీతో!

  • ‘వ్యవసాయ యాంత్రీకరణ’ పునఃప్రారంభం

  • 1.31 లక్షల యూనిట్ల పంపిణీకి శ్రీకారం

  • సంక్రాంతి నుంచి ప్రక్రియ షురూ

  • ప్రకృతి సాగుకు 4 వేల ప్రోత్సాహకం

  • రెండు పథకాలను ప్రారంభించిన మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌

కొత్తగూడెం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రైతులకు సంక్రాంతి కానుకగా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించింది. కొన్నేళ్లుగా నిలిచిపోయిన ఈ పథకాన్ని పునరుద్ధరిస్తూ, 1,31,182 వ్యవసాయ పరికరాలను 50 శాతం రాయితీతో అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.101.93 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో శుక్రవారం జరిగిన ‘రైతుమేళా’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రోటావేటర్లు, బ్యాటరీ స్ర్పేయర్లు, కల్టివేటర్లు, పవర్‌ టిల్లర్ల వంటి సుమారు 15 రకాల యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. సంక్రాంతి నుంచే ఈ పరికరాల పంపిణీ ప్రక్రియ మొదలుకానుందని మంత్రి తుమ్మల తెలిపారు. దీని వల్ల సాగు సమయం తగ్గడమే కాకుండా, రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఎంపిక ప్రక్రియ ప్రారంభించిన అధికారులు మొత్తం 1.31 లక్షల పరికరాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 10,715 యూనిట్లు, సంగారెడ్డిలో 7,883 యూనిట్ల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశారు.


ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహకం..

వ్యవసాయ యాంత్రీకరణతో పాటు రసాయన రహిత సాగును ప్రోత్సహించేందుకు ‘నేషనల్‌ మిషన్‌ ఆఫ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌’ పథకాన్ని కూడా మంత్రులు ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఎకరానికి రూ.4వేల చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 489 క్లస్టర్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా 61 వేల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే సాగుకు అవసరమైన జీవ ఉత్పాదకాలను తయారు చేసుకునేందుకు 326 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి ఒక్కో కేంద్రానికి రూ.1లక్ష ఆర్థిక సాయం అందనుంది.

బీఆర్‌ఎస్‌ అసమర్థతతోనే బ్యారేజీలు కూలిపోయాయి

వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయ పథకాలను ప్రారంభించిన అనంతరం మంత్రులు దమ్మపేట మండలంలోని సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన 4వ పంప్‌హౌజ్‌ను పరిశీలించి ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అసమర్థత, చేతకానితనం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు కూలిపోయాయని, 1.83 లక్షల కోట్లు ఖర్చు చేసినా రైతులకు ఆశించిన స్థాయిలో నీరు అందలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా కోసం గట్టిగా కృషి చేశామని, రాష్ట్ర హక్కులను దెబ్బతీసే విధంగా ఉన్న పోలవరం పనులపై సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నామని తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని, ఇందుకోసం సీతారామ ప్రాజెక్టును వచ్చే మూడేళ్లలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. గతంలో ప్రధాన కాలువలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారని, కానీ తమ ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీ కాలువల కోసం రూ.4 వేల కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ ఏడాది జూలై నాటికి యాతాలకుంట టన్నెల్‌ పూర్తిచేసి సత్తుపల్లి నియోజకవర్గానికి నీళ్లు తీసుకొస్తామన్నారు. త్వరలోనే నాలుగో పంప్‌ హౌజ్‌ పూర్తి చేసి అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు కూడా నీరందిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Jan 10 , 2026 | 05:30 AM