Share News

3 నెలల్లో పెండింగ్‌ బిల్లుల చెల్లింపు!

ABN , Publish Date - Jun 17 , 2026 | 05:10 AM

కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. 3 నెలల్లో పెండింగ్‌ బిల్లులను చెల్లించేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు.

3 నెలల్లో పెండింగ్‌ బిల్లుల చెల్లింపు!

  • కాంట్రాక్టర్లకు ప్రభుత్వం హామీ.. భట్టి, కోమటిరెడ్డితో ప్రతినిధుల భేటీ

  • బీఆర్‌ఎస్‌ హయాంలో ఆర్‌అండ్‌బీ బకాయిలే రూ.4 వేల కోట్లు

  • మేం వచ్చాక రూ.3 వేల కోట్లు ఇచ్చాం

  • మిగిలినవీ చెల్లిస్తాం: కోమటిరెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. 3 నెలల్లో పెండింగ్‌ బిల్లులను చెల్లించేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల మంజూరు కోసం ఈ నెల 18వ తేదీన కాంట్రాక్టర్లు ‘చలో హైదరాబాద్‌’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు, సివిల్‌ కాంట్రాక్టర్లతో మంత్రి మంగళవారం సమావేశమయ్యారు. బిల్లుల చెల్లింపుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 3-4 రోజులలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కాంట్రాక్టర్ల సమస్యలపై సమగ్రంగా చర్చించి.. మూడు నెలల వ్యవధిలో పెండింగ్‌ బకాయిలను చెల్లించేలా కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బకాయి బిల్లుల్లో ఆర్‌అండ్‌బీ పరిధిలోనే రూ.4వేల కోట్లు ఉన్నాయని, యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు చేపట్టిన సంస్థలకు కూడా రూ.350కోట్ల మేర బకాయిలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక పరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పెండింగ్‌ బకాయిల చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్‌అండ్‌బీ పరిధిలోని కాంట్రాక్టర్లకు రూ.3,000 కోట్లకు పైగా బిల్లులు విడుదల చేశామని, ఇంకా సుమారు రూ.2,500 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. వాటిని త్వరలోనే దశల వారీగా చెల్లిస్తామని భరోసానిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపుల్లో ఎనలేని జాప్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అది బీఆర్‌ఎస్‌ పాపమేనని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో హ్యామ్‌ విధానంలో చేపట్టదల్చిన పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. నల్లగొండ జిల్లా పరిధిలో లక్ష మందితో సభ నిర్వహించి రూ.13,000 కోట్ల విలువైన హ్యామ్‌ రోడ్లు పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. హైదరాబాద్‌-విజయవాడ రహదారిని రూ.10,410కోట్ల వ్యయంతో ఆరు లేన్లు, రెండు సర్వీస్‌ రోడ్లతో విస్తరించనున్నట్లు తెలిపారు. భూసేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. అమరావతి-మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే వంటి పలు కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. కాంట్రాక్టర్లు సహకరిస్తే అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతమవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.


బకాయిలను దశలవారీగా చెల్లిస్తాం: భట్టి

చిన్న సివిల్‌ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. మంత్రి కోమటిరెడ్డితో సమావేశం అనంతరం బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు, సివిల్‌ కాంట్రాక్టర్లు ప్రజాభవన్‌లో భట్టిని కలిసి బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్న కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఆర్థిక శాఖ ప్రతి నెలా బిల్లులను చెల్లిస్తోందని భట్టి గుర్తు చేశారు. దశలవారీగా పెండింగ్‌ బకాయిలను పూర్తిగా చెల్లించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

‘చలో హైదరాబాద్‌’ వాయిదా

ప్రభుత్వ హామీతో తాము సంతృప్తి చెందామని, ‘చలో హైదరాబాద్‌’ను వాయిదా వేసుకుంటున్నట్లు బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర చైర్మన్‌ రవీందర్‌రెడ్డి ప్రకటించారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డిలకు అసోసియేషన్‌ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 17 , 2026 | 05:10 AM