Share News

ఇకపై ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలు

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:08 AM

ప్రభుత్వోద్యోగులతోపాటు వివిధ విభాగాల్లో పని చేసే కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు అందించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది.

ఇకపై ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలు

  • సకాలంలో చెల్లించలేకపోతే అధికారులపై చర్యలు

  • ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఊరట

హైదరాబాద్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వోద్యోగులతోపాటు వివిధ విభాగాల్లో పని చేసే కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు అందించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. సంబంధిత అధికారులు ఈ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని కోరుతూ మంగళవారం పే అండ్‌ అకౌంట్స్‌ అధికారి (పీఏఓ) నుంచి సర్క్యులర్‌ జారీ అయింది. జీతాలు, పారితోషికాల చెల్లింపులకు సంబంధించిన బిల్లుల తయారీ, సమర్పణ, పరిశీలన, ఆడిట్‌, ఆథరైజేషన్‌ వంటి ప్రక్రియలన్న్నీ ఆయా శాఖల అధికారులు నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. పరిపాలనా లోపాలు, ఇతర కారణాలతో జాప్యం జరిగితే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి శాఖాధిపతులు, డీడీవోలపై నేరుగా బాధ్యతను నిర్ధారిస్తామని పీఏవో స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల నెలల తరబడి జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని.. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఐకాస ఛైర్మన్‌ పులి లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 04:08 AM